పార్టీలో డ్రగ్స్ అసలు లేవు.. ఇదీ జరిగింది: మంగ్లీ
ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వార్తల్లో నిలిచాయి.
ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వార్తల్లో నిలిచాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ వీడియోను విడుదల చేశారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె వివరించారు. పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో, అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు మంగ్లీ. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారని తెలిపారు మంగ్లీ. మద్యం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై తనకు అవగాహన లేదని, రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదన్నారు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని, గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారని మంగ్లీ వివరించారు. ఆధారాలు లేకుండా అభియోగాలు తనపై మోపొద్దని మంగ్లీ కోరారు.