మోదీని ఇరుకున పెడుతున్న మీనన్

Update: 2016-10-12 13:11 GMT

సర్జికల్ దాడుల విషయంలో మోదీ సర్కారు కు ఇప్పటిదాకా ఒకే ఇబ్బందికరమైన వ్యాఖ్య వచ్చింది. నిజానికి ఇప్పుడు జరిగిన దాడుల ఆధారాలు చూపాలంటూ వచ్చిన డిమాండ్లు పెద్ద ఇబ్బంది పెట్టేవి కాదు గానీ.. కాంగ్రెస్ నాయకులు చేసిన ఒక వ్యాఖ్య మాత్రం ఇబ్బందికరమైనదే. మన్మోహన్ సింగ్ హయాంలో కూడా ఆరు సర్జికల్ దాడులు జరిగాయని... ఎప్పుడూ వాటి గురించి బహిరంగంగా ప్రకటన చేయలేదని ఓ వ్యాఖ్య వచ్చింది.

ఇవాళ ఆ వాదనకు మద్దతుగా మరో వ్యాఖ్య కూడా తెరమీదకు వచ్చింది. మన్మోహన్ సింగ్ హయాంలో జాతీయ భద్రత సలహాదారుగా శివశంకర మీనన్ పనిచేశారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మార్లు సర్జికల్ దాడులు చేసినట్లుగా వెల్లడించారు. అప్పట్లో తాము చేసిన దాడుల లక్ష్యం వేరు అని ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో దాడులు చేసిన విషయాన్ని తాము ఎన్నడూ వెల్లడించలేదని ఆయన ప్రకటించారు. తాము దాడులు చేసిన ఉద్దేశం వేరని, దేశంలో ప్రజల మనోభావాలను మేనేజ్ చేయడం కాదని శివశంకర మీనన్ వెల్లడించడం మోదీ సర్కారుకు ఇబ్బందికరమైన అంశం.

సర్జికల్ దాడుల అంశం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కారు కీర్తి పెరిగింది. ఇవాళ పారికర్ కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ క్రెడిట్ మొత్తం మోదీ మరియు సైన్యానికి దక్కుతుందని కట్టబెట్టేశారు. ఇప్పుడు శివశంకర్ మీనన్.. ప్రజల మనోభావాలను మేనేజ్ చేయడం కోసమే మోదీ ప్రభుత్వం ప్రచారానికి పాల్పడుతున్నది అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ప్రజలను మరో కోణంలో ఆలోచింపజేయవచ్చునని అనిపిస్తోంది.

Similar News