కనీసం అభ్యర్థికి కూడా గతి లేదా?

Update: 2016-11-08 00:15 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దస్థాయిలో పోరాటాలను ప్రకటిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రదర్శించడంలో చాలా ఆవేశం చూపిస్తూ ఉంటుంది. ఏదో సెంటిమెంటు పుణ్యమాని కేసీఆర్ గద్దె మీద ఉన్నారు తప్ప.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే కృతజ్ఞత ప్రజల్లో ఉన్నదని, 2019లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గద్దెమీదికి వస్తాం అని కాంగ్రెస్ సదా అంటూ ఉంటుంది. అయితే వాస్తవంలోకి వస్తే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే.. తమ పార్టీ తరఫున సొంతంగా ఓ అభ్యర్థిని మోహరించడానికి కూడా ఆ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితి. పీఆర్‌టీయూ అభ్యర్థికే మద్దతు ఇచ్చి.. తెరాస అభ్యర్థిని ఓడించాలని కాంగ్రెస్ ప్రస్తుతం అనుకుంటుండడం వారి పరిస్థితికి నిదర్శనం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే వారికి కూడా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు వేయించుకోవాల్సి వస్తే భంగపాటు తప్పదేమో అనే భయం కాంగ్రెస్ పార్టీలో పుష్కలంగా ఉన్నట్లుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాంగ్రెస్ దిగ్గజాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ తదితరులందరూ కూర్చుని చర్చించారు. కానీ.. సొంత అభ్యర్థిని మోహరించడానికి మాత్రం సాహసించలేకపోయారు.

ప్రస్తుతానికి పీఆర్టీయూ అభ్యర్థి వెంకటరెడ్డికి మద్దతు ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన. కనీసం ఆ విషయంలోనైనా చిత్తశుద్ధితో పోరాడి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును రాబట్టగలుగుతారో లేదో చూడాలి. అసలే ఇటీవలి కాలంలోనే ఉపాధ్యాయ వర్గానికి కేసీఆర్ సర్కారు పలు వరాలు ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షంగా గులాబీ పార్టీకి అనుకూలంగా సాగవచ్చుననే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Similar News