ఆ సన్ రైజర్స్ ఆటగాడిపై రాజకీయ నాయకుల ప్రశంసలు

చివరి ఓవర్‌లో మెయిడెన్ వేసిన నాలుగో బౌలర్‌గానూ ఉమ్రాన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఉమ్రాన్ కంటే ముందు ఇర్ఫాన్ పఠాన్, లసిత్ మలింగ, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.

Update: 2022-04-18 04:43 GMT

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో జయభేరి మోగించింది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 152 పరుగుల విజయలక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 4 విజయాలు సాధించింది.


ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనగర్‌కు చెందిన రైటార్మ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి స్పీడ్ గురించి ఇప్పటికే చర్చల్లో నిలిచిన మాలిక్.. కట్టుదిట్టమైన బౌలింగ్ తో కూడా ఆకట్టుకుంటూ ఉన్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ అద్భుత స్పెల్‌తో ఇరగదీశాడు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి ఓవర్‌లో మెయిడెన్ వేసిన నాలుగో బౌలర్‌గానూ ఉమ్రాన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఉమ్రాన్ కంటే ముందు ఇర్ఫాన్ పఠాన్, లసిత్ మలింగ, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.

అతడి బౌలింగ్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అతడిని వీలైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలని కోరారు. అతడిలో రక్తం ఉరకలెత్తుతోందని, అతడో అద్భుతమైన ప్రతిభావంతుడని ప్రశంసించారు. టీమిండియాలో అతడికి చోటు కల్పించి ఇంగ్లండ్ తీసుకెళ్తే ఆంగ్లేయులను బెంబేలెత్తిస్తాడంటూ ట్వీట్ చేశారు.

ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఉమ్రాన్ మాలిక్ విసిరే బంతులు నమ్మశక్యం కాని రీతిలో ఉంటున్నాయని కితాబిచ్చారు. ఇవాళ్టి మ్యాచ్ లో అతడి ప్రదర్శన ఐపీఎల్ లోనే అత్యుత్తమం అయ్యుంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ యువ ఆటగాడికి అభివందనం చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News