చిత్తైన ముంబై.. మరో టైటిల్ పోరులో గుజరాత్

Update: 2023-05-27 03:19 GMT

గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబయి ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ 62 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 234 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 4 వికెట్లు పడగొట్టగా, షమీ 2, రషీద్ ఖాన్ 2, జోష్ లిటిల్ 1 వికెట్ తీశారు. ముంబయి ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ 43, కామెరాన్ గ్రీన్ 30 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), నేహాల్ వధేరా (4), టిమ్ డేవిడ్ (2), విష్ణు వినోద్ (2) విఫలమయ్యారు.

టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. 129 పరుగులు సాధించాడు గిల్. అతడి సూపర్ ఇన్నింగ్స్ లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్ కు కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ పోరాడడంతో కొద్దిసేపు గెలుపు రేసులో నిలిచింది. వీరు పెవిలియన్ చేరాక ముంబయి ఓటమి దిశగా పయనించింది. ఈ విజయంతో ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ ఈ నెల 28న టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది.


Similar News