కింగ్ కోహ్లీ ముందు క్లాసెన్ సెంచరీ వృధా.. ఉప్పల్ లో పరుగుల వరద

క్లాసెన్ 51 బంతుల్లోనే 104 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 8 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. హ్యారీ బ్రూక్ కూడా..

Update: 2023-05-19 03:18 GMT

RCB VS SRH match highlights

సన్ రైజర్స్ మరో మ్యాచ్ లో ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరును ఛేజ్ చేశారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీ ఆడుతుంటే ఉప్పల్ స్టేడియం కాస్తా చిన్న స్వామి క్రికెట్ స్టేడియంలా మారిపోయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. క్లాసెన్ ఈ మ్యాచ్ లో సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాడు. క్లాసెన్ 51 బంతుల్లోనే 104 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 8 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. హ్యారీ బ్రూక్ కూడా వేగంగా ఆడడం విశేషం. బ్రూక్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 27 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠి (15) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 20 బంతుల్లో 18 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 2, సిరాజ్ 1, షాబాజ్ అహ్మద్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
ఛేజింగ్ లో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 187 పరుగుల లక్ష్యఛేదనలో కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, నటరాజన్ 1 వికెట్ తీశారు. కోహ్లీకి ఇది ఐపీఎల్ లో ఆరో సెంచరీ. భారత ఆటగాళ్లలో ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.


Tags:    

Similar News