పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ చిన్న వయసులోనే సూపర్ క్రికెటర్ గా రాణిస్తున్నాడు

Update: 2023-05-01 03:57 GMT

ఐపీఎల్ ఈ సీజన్‌లో ఎంతో మంది యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. వారిలో యశస్వి జైశ్వాల్ ఒకడు. పేద కుటుంబం నుంచి క్రికెటర్‌‌గా ఎదిగిన జైశ్వాల్ జీవితం అందరికీ ఆదర్శం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదన్నది యశస్వి రుజువు చేశాడు. నిన్న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ యశస్వి ఆట మాత్రం అద్భుతహ: అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. టీ 20లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కారు. ఆరెంజ్ క్యాప్ ధరించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్‌లో బ్రూక్, వెంకటేష్ అయ్యర్, యశస్వి జైశ్వాల్‌లు మాత్రమే సెంచరీలు చేశారు.

124 పరుగులు చేసి...
నిన్న ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్ 124 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంను అదర గొట్టేశాడు. ఎవరీ జైశ్వాల్ అని అందరూ అనుకునేలా చేశాడు. అయితే యశస్వికి ఈ పేరు ఊరికే రాలేదు. ఎంతో శ్రమ, కష్టనష్టాలకు ఓర్చి ఈ దశకు చేరుకున్నాడు. అతని తండ్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహిలో ఒక వాచ్‌మెన్. యశస్వికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. ఎంతగా అంటే బ్యాట్, బాల్ కనిపిస్తే చాలు యశస్వి ఒళ్లు పులకరించిపోయేలా. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటే తాను క్రికెటర్ గా ఎదగలేడని భావించి ముంబయి చేరుకున్నాడు.
పానీపూరీ అమ్మి...
అక్కడ ఒక పానీపురం దుకాణంలో విక్రయించాడు కూడా. అలా పొట్ట నింపుకుంటూనే ఇటు క్రికెట్ పై శ్రద్ధ పెట్టాడు. యశస్వి ప్రతిభను గుర్తించిన ఒక కోచ్ వెంటనే చేరదీశాడు. ఇండియా అండర్ 19లో స్థానం సంపాదించిన యశస్వి ఇక వెనుదిరగి చూసుకోలేదు. 21 ఏళ్ల యశస్వికి ఎంతో భవిష్యత్ ఉంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండు కోట్లు వెచ్చించి యశస్విని దక్కించుకుంది. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని యశస్వి వమ్ము చేయలేదు. వరసగా ఐదు మ్యాచ్‌లలో అర్థ సెంచరీలు నమోదు చేసిన యశస్వి ఆదివారం మాత్రం సెంచరీ చేసి ఈ సీజన్‌లో మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
వజ్రమే...
యశస్వి జైశ్వాల్ కొడుతున్న షాట్లను చూసి మాజీ క్రికెటరలు అబ్బుర పడుతున్నారు. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. యశస్వికి ఈ ఐపీఎల్ పూర్తిగా కలసి వచ్చిందనే చెప్పాలి. అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా జైశ్వాల్ ఉపయోగించుకుంటున్నాడు. టీం ఇండియాలో చోటు సంపాదించాలన్నదే ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం ఎంతో దూరం లేదన్నది క్రికెట్ పండితులు సయితం అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఈ ఐపీఎల్ సీజన్‌లో టీం ఇండియాకు దొరికిన వజ్రం యశస్వి జైశ్వాల్ అని చెప్పక తప్పదు. ఆల్ ది బెస్ట్ యశస్వి.


Tags:    

Similar News