చెన్నై కు మరో ఓటమి.. రషీద్ సూపర్ ఇన్నింగ్స్

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది.

Update: 2022-04-18 03:16 GMT

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్, రషీద్‌ఖాన్ దూకుడుగా ఆడడంతో విజయం గుజరాత్ నే వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, అంబటి రాయుడు 46, శివమ్ దూబే 19, రవీంద్ర జడేజా 22 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, మహ్మద్ షమీ 1, యశ్ దయాళ్ 1 వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తప్పుకోవడంతో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.



అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌కు మంచి ఆరంభం దక్కలేదు. శుభమన్‌గిల్, విజయ్ శంకర్ ఫెయిల్యూర్ అయ్యారు. సాహా, అభినవ్ మనోహర్ (12), రాహుల్ తెవాటియా (6) కూడా ఆకట్టుకోలేకపోయారు. 87 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో విజయంపై చెన్నై శిబిరంలో ఆశలు కనిపించాయి. అప్పుడు డేవిడ్ మిల్లర్ షో మొదలైంది. 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా తొలి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మూడో బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన మిల్లర్ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు అవసరం కాగా, ఫుల్‌టాస్‌‌గా వచ్చిన నాలుగో బంతిని ఆడే ప్రయత్నంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌‌కు మిల్లర్ క్యాచ్ ఇచ్చాడు. ఆ బంతిని థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో చెన్నై షాక్ అయింది. ఆ తర్వాతి ఫ్రీ హిట్ బంతిని ఫోర్ కొట్టిన మిల్లర్, ఐదో బంతికి రెండు పరుగులు తీయడంతో విజయం గుజరాత్ సొంతమైంది. మిల్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 10 పాయింట్లతో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చెన్నై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. చెన్నై బౌలర్లలో బ్రావోకు 3, మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి.


Tags:    

Similar News