IPL 2024 : అనుకున్నామని జరగవు అన్నీ.. అదే ఐపీఎల్.. అదే చెన్నై ఓటమి

చెన్నైలో జరిగిన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో చివరకు పంజాబ్ నే విజయం వరించింది

Update: 2024-05-02 02:54 GMT

ఐపీఎల్ లో ఏది అనుకున్నామో అది జరగడం లేదు.. అందరూ మరో గెలుపు కోసం ఎదురు చూస్తుంటే ఓటములు తప్పడం లేదు. ఓటములు తప్పడం లేదు అని నిరాశ చెందిన అభిమానులకు మాత్రం మళ్లీ ఆశలు పుట్టిస్తున్నాయి. అదే ఐపీఎల్. అందుకే ఐపీఎల్ అంటే అంత క్రేజ్. ఏ సీజన్ లో లేని విధంగా ఐపీఎల్ లో అనేక జట్లు అంచనాలకు అందకుండా చిట్ట చివరి స్థానంలోకి చేరుకున్నాయి. అదే సమయంలో ఊహించని జట్లు అగ్రస్థానాన కొనసాగుతున్నాయి. ప్రారంభంలో పేలవమైన ప్రదర్శన చేసిన జట్లు కూడా చివరిలోకి వచ్చే సరికి పుంజుకుని ప్లే ఆఫ్ రేసులో తాము ఉన్నామంటూ ముందుకు దూసుకు వస్తున్నాయి.

స్వల్ప లక్ష్యమే అయినా...
నిన్న చెన్నైలో జరిగిన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో చివరకు పంజాబ్ నే విజయం వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు తన సొంత మైదానంలో అతి తక్కువ స్కోరుకే అవుట్ అయింది. ఇరవై ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. రహానే 29 పరుగులు చేసి అవుటయ్యాడు. రుతురాజ్ ఒక్కడే మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ 62 పరుగులు చేశాడు. శివమ్ దూబే డకౌట్ అయ్యాడు. జడేజా రెండు పరుగులకే వెనుదిరిగి నిరాశపర్చాడు. రిజ్వి 21 పరుగులు, మొయిన్ ఆలీ 15, ధోనీ 14 పరుగులు చేసి జట్టుకు ఆ మాత్రం స్కోరును అందించారు.
పెద్ద స్కోరు కాకున్నా....
అయితే ఇది అటు పెద్ద స్కోరు కాదు.. ఇటు చిన్న స్కోరు కాదు.. పంజాబ్ ను నిలువరించడం పెద్ద పని కాదన్న అభిప్రాయంలో చెన్నై ఫ్యాన్స్ స్టేడియంలో కూర్చున్నారు. కానీ మన ఊహలకు అతీతంగా జరిగితేనే కదా? అది ఐపీఎల్ అయితే పంజాబ్ జట్టుకు చెన్నై చెక్ పెట్టలేకపోయింది. 163 పరుగుల లక్ష్యసాధనలో ప్రభ్ సిబ్రాన్ 13 పరుగులకే అవుటయ్యాడు. బెయర్ స్టో 46 పరుగుుల చేశాడు. రోసో 43 పరుగులు చేశాడు. శశాంక్ 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సామ్ కరన్ 26 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. చివరకు పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో చెన్నై పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది.


Tags:    

Similar News