IPL 2024 : పాండ్యాకు పైకి చూడటమే సరిపోయింది.. ఈ బాదడం ఏంది బాబాయ్?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు శివాలెత్తిపోయారు

Update: 2024-03-28 03:34 GMT

నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ బ్యాటింగ్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. బాదుడు అంటే ఇలా ఉంటుందా? ఊచకోతకు ఉదాహరణ ఇదేనా? అని అనిపించక మానదు. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ తో జరిగింది. తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అదే తాము చేసిన తప్పు అని గ్రౌండ్ లోకి దిగిన తర్వాత అర్ధమయి ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ కు దిగిన వాళ్లంతా బాది పడేస్తున్నారు. ఒకటి.. రెండు రన్స్ కాదు.. కొడితే ఫోర్ లేకుంటే.. సిక్సర్... బౌలర్ ఎవడన్నది కాదన్నయ్యా? బాదేయడమే అన్న రీతిలో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు.

రికార్డును తిరగరాసి...
ఐపీఎల్ చరిత్రనే సన్ రైజర్స్ తిరగరాశారు. ఐపీఎల్ ప్రారంభించిన ఇప్పటి వరకూ ఇంత భారీ స్కోరు ఏ జట్టు చేయలేదు. 277 పరుగులు కేవలం మూడు వికెట్లు పోయి చేసిందంటే ఆట ఎలా జరిగిందో కంటితో చూడకున్నా ఊహించుకోవచ్చు. రీప్లేలో చూసినా వారి బాదుడు ఈ మ్యాచ్ చూడని వారికి అర్థమవుతుంది. గతంలో బెంగళూరు జట్టు 263 అత్యధిక పరుగులు చేసి ఐపీఎల్ లో రికార్డును నమోదు చేసింది. కానీ ఆ రికార్డును సన్ రైజర్స్ నిన్న తిరగరాసేసంది. కేవలం 16 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడంటే వేరే చెప్పాల్సిన పనిలేదు. అభిషేక్ శర్మ 63 పరుగులు, క్లాసెన్ 80 పరుగులు, హెడ్ 62 పరుగులు.. మార్క్రమ్ 42 పరుగులు ఇలా ఏ ఒక్కరూ తక్కువ కాకుండా బాదుడే బాదుడు. అందుకే ఈ మ్యాచ్ చూసిన వాళ్లకు సన్ రైజర్స్ ఆటగాళ్లలో ఇంత కసి ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖంలో నెత్తురు చుక్క లేదే...
ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లయితే మైదానంలో సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పూర్తిగా నిరాశతోనే కనిపించారు. రోహిత్ శర్మ నుంచి హార్థిక్ పాండ్యా, బుమ్రా.. ఇలా ఒక్కరేమిటి జట్టులో ప్రతి ఒక్కరూ పరుగులు తీయడంతోనే సరిపోయింది. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తుంటే ఎవరు మాత్రం కుదురుగా ఉంటారు. ఆశ్చర్యంతో కూడిన విషాదం ముంబయి ఆటగాళ్ల మొహాల్లో కనిపించాయి. హార్థిక్ పాండ్యా అయితే క్లాసిన్ కొట్టిన ప్రతి సిక్సర్ ను ఆకాశం వైపు చూస్తూనే ఉండటం కనిపించింది. మూడు వికెట్లు పడ్డాయన్న మాటే గాని ముంబయి ఇండియన్స్ ఆటగాళ్ల మొహాల్లో నెత్తురు చుక్కలేదంటే నమ్మాలి మరి.. అయితే ఆ తర్వాత వారు కూడా బాగానే ఆడి ఒకింత ఆటను రసవత్తరంగా మార్చారనుకోండి. సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసిన వాళ్లకు మాత్రం ఈ భావాలు స్పష్టంగా అనిపించవచ్చు.


Tags:    

Similar News