వినాయక చవితికి రూ.316.4 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ

ఏకంగా రూ.316.4 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీని గణేష్ ఉత్సవాల కోసం చేయించారంటే చాలా మంది నోళ్లెళ్లబెడతారు

Update: 2022-08-27 02:01 GMT

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే నగరాల్లో ముంబై ఒకటి. ఇక్కడ పోటీ పడి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వినాయక చవితిని నిర్వహిస్తూ వస్తుంటారు. అది కూడా అక్కడి గణేష్ ఉత్సవ మండల్స్ కు భారీ స్థాయిలో ఆదాయం.. నిధులు ఉన్నాయి. దీంతో ఏ మాత్రం తగ్గకుండా ఏర్పాట్లను చేసుకుంటూ వెళుతుంటారు. తాజాగా ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే గణేష్ ఉత్సవాలకు భారీగా ఇన్సూరెన్స్ చేయించడం. అది కూడా వందల కోట్ల ఇన్సూరెన్స్..! నిజంగానే ఆశ్చర్య పోతున్నారు కదూ. ఏకంగా రూ.316.4 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీని గణేష్ ఉత్సవాల కోసం చేయించారంటే చాలా మంది నోళ్లెళ్లబెడతారు.

ముంబయిలోని అత్యంత ధనిక గణేశోత్సవ్ మండల్ 'GSB సేవా మండల్ కింగ్స్ సర్కిల్' రికార్డు స్థాయిలో రూ.316.4 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా సంస్థ నుంచి ఈ పాలసీని కొనుగోలు చేశారు. 2016లో జీఎస్‌బీ రూ.300 కోట్ల విలువైన పాలసీని తీసుకుంది. మండలంలోని మహా గణపతిని సుమారు 66 కిలోల బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే భారీగా ఇన్సూరెన్స్ ను తీసుకుంటూ ఉంటారు. ఈ పాలసీ వివిధ రకాల రిస్క్‌లను కవర్ చేస్తుంది. ఇందులో రూ.31.97 కోట్లు విగ్రహాన్ని అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలను కవర్ చేస్తుంది. మిగిలినది మండల వాలంటీర్లు, పూజారులు, కుక్‌లు, స్టాల్ కార్మికులు, వాలెట్ పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు కూడా కవర్ లభిస్తుంది. వడాలాలోని రామమందిర్‌కు చెందిన సమాంతర GSB సర్వజనిక్ మండల్ కూడా రూ.250 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంది.


Tags:    

Similar News