Vinayaka Chavithi : చవితి రోజు చంద్రుడిని చూడకండి.. పురాణ కథలు ఏం చెబుతున్నాయంటే?

వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. వినాయకచవితి అంటే పెద్దలు, పిల్లలందరకీ ఇష్టమైన పండగ

Update: 2025-08-27 03:41 GMT

గణేశుడు సకల దేవతలకి గణ నాయకుడు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా ఆయనను పూజిస్తారు. వినాయకుడి ఆశీస్సులు పొందాలని భావించే ప్రతి ఒక్కరు ముందుగా ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందే. వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. వినాయకచవితి అంటే పిల్లలందరికీ ఇష్టం. ఎందుకంటే కొత్త బట్టలు ధరించి, పిండివంటలు తినేందుకు మాత్రమే కాకుండా పత్రి కొనుగోలు చేయడం, తండ్రితో కలసి వినాయకుడి విగ్రహం కొనుగోలు వరకూ అంతా ఒకరమైన ఆనందమే. దీపావళి తరహాలోనే పిల్లలకు, పెద్దలకు అత్యంత ఇష్టమైన పండగ వినాయక చవితి. కానీ వినాయక చవితి రోజు చంద్రున్ని చూడవద్దని అంటారు.పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయి.

శివుడిని అడ్డుకోవడంతో...
పురాణ కథల ప్రకారం...కైలాసంలో పార్వతి తన భర్త శివుడి కోసం ఎదురు చూస్తుంది. భర్త వచ్చే సమయానికి స్నానం ఆచరించి సిద్దమవ్వాలని భావించింది. స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా వుంచి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు..ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంచే ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుందంటార. పార్వతి కళ్లలో నీళ్లను చూసిన శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడి దేహభాగానికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. ఆ బాలకుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి గణాధిపతిని చేశాడు.
చంద్రుడు నవ్వడంతో్...
అలాంటి గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుడి శిరస్సున గల చంద్రుడు నవ్వాడు. దాంతో భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో .. వారు నీలాపనిందలను ఎదుర్కుంటారని గణపతి శపించాడని పురాణ కథలు చెబుతున్నాయి. అంతా కలిసి వినాయకుడికి నచ్చజెప్పడంతో, ఆ రోజున తన కథ చెప్పుకుని అక్షింతలు తలపై ధరించిన వారికి ఈ శాపం వర్తించదని కూడా చెప్పారు. ఇక పాల పాత్రలో ఆ రోజున చంద్రుడిని చూసినందుకు గాను శ్రీ కృష్ణుడంతటి వాడుకూడా నీలాపనిందలను మోయవలసి వచ్చిందని, ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు.. మానవులు ఈ రోజున వినాయకుడిని పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించసాగారరని, ఆ రోజు నుంచి గణ నాయకుడిగా.. విద్యా విజ్ఞాలను ప్రసాదించే అధినాయకుడిగా వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. తన భక్తులు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా వినాయకుడు అందరినీ అనుగ్రహిస్తున్నాడు.


Tags:    

Similar News