విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రకేసులో పురోగతి... విదేశాలకు పారిపోతుండగా?
విజయనగరం కుట్ర కేసులో మరో అరెస్ట్ జరిగింది. జయనగరంలో కుట్ర చేసి దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు జరిగిన కుట్ర కేసులో ఆరిఫ్ హుస్సేన్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు
విజయనగరం కుట్ర కేసులో మరో అరెస్ట్ జరిగింది. ఐసిస్ ఉగ్రవాద కార్యక్రమాల్లో విజయనగరంలో కుట్ర చేసి దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు జరిగిన కుట్ర కేసులో ఆరిఫ్ హుస్సేన్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. విజయనగరం బాంబు కుట్ర కేసులో అనేక మంది పాల్గొన్నారని అప్పట్లో జరిపిన విచారణలో వెల్లడయింది. విజయనగరానికి చెందిన సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్ ను గతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో అనేక మంది భాగస్వామ్యులయి ఉన్నారని సిరాజ్, సమీర్ ల విచారణలో వెల్లడి కావడంతో వారి కోసం వెదుకుతున్నారు.
దర్యాప్తు వేగం....
విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో వేగం పెంచింది. ఉగ్రవాద మూలాలున్న సమీర్, సిరాజ్ ల విచారణలో హైదరాబాద్, వరంగల్, విజయనగరం, బెంగళూరు నగరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడయింది. విదేశాల నుంచి నిధులు వీరికి అందినట్లు కూడా దర్యాప్తులో వెల్లడి కావడంతో ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరంలో ఉంటూ దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి వెళ్లి విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు సమీర్, సిరాజ్ లు విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. అహిం పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి బాంబు పేలుళ్ల కుట్రకు ప్లాన్ చేశారని దర్యాప్తుల్లో వెల్లడయింది.
ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి...
సమీర్ పలుమార్లు ఢిల్లీ, ముంబయివెళ్లి రావడంతోపాటు సౌదీ నుంచి నిధులు సిరాజ్ కు అందడంతో ఈ దర్యాప్తును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా ఈ కేసులో తాజాగా బీహార్ కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలలియాస్ అబు తాలిబ్ విదేశాలకు పారిపోతుండగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సమీర్, సిరాజ్ లతో నిరంతరం ఆరిఫ్ హుస్సేన్ వాట్సప్ లో చేస్తూనే ఉన్నాడని ఎన్ఐఏ విచారణలో వెల్లడయింది. అలాగే ఆరిఫ్ హుస్సేన్ దేశంలోని పలు ప్రాంతాలకు కూడా ఆరిఫ్ హుస్సేన్ ఆయుధాలను సరఫరా చేసినట్లు తేలడంతో అతనిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంకా అనేక మంది ఈ కేసులో భాగస్వామ్యులయినట్లు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు.