విషాదం.. సర్జరీ వికటించి మరో టీవీ నటి మృతి
మే 16 సోమవారం బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్ లో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్యాట్ ఫ్రీ కోసం..
బెంగళూరు : కన్నడ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఇటీవల కేరళ కు చెందిన మోడల్, నటి షహానా, నిన్న బెంగాలీ నటి పల్లవీ డే అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ పరిశ్రమకు చెందిన మరో టీవీ నటి చేతనా రాజ్ మృతి చెందింది. కాస్మొటిక్ సర్జరీ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చేతనారాజ్ కన్నడలో పలు టీవీ షోలు, సీరియల్స్ చేశారు.
మే 16 సోమవారం బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్ లో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్యాట్ ఫ్రీ కోసం చేతనా రాజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సర్జరీ చేయించుకున్న సాయంత్రానికి ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారట. ఆ ఆస్పత్రిలో ఐసీయూ లేకపోవడంతో వెంటనే మంజునాథ్ నగర్లోని కడే ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లేసరికే చేతనా రాజ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు వైద్యం చేయాలంటూ కడే ఆస్పత్రి వైద్యులను కాస్మొటిక్ ఆస్పత్రి వైద్యుడొకరు బెదిరించడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చేతనా రాజ్ తన కుటుంబసభ్యులకు తెలియకుండా ఈ సర్జరీ చేయించుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. తమ కుమార్తె మరణానికి కాస్మొటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని చేతనా రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 21 ఏళ్ల పిన్న వయసులోనే ఆమె మరణించడం బాధాకరం. పోస్టుమార్టంలో ఆమెమృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ''భగవంతుడు చేతనా రాజ్ కు అందమైన శరీరం ఇచ్చాడు. గ్లామరస్ గా ఉండటం కోసం ఎందుకు దానిని చేంజ్ చేసుకోవడం! తనను తాను చంపుకోవడం? ప్రకృతితో ఎప్పుడూ ఆటలు ఆడవద్దు'' అంటూ ఓ నెటిజన్ చేతనా రాజ్ మృతిపట్ల ట్వీట్ చేశారు.
కాగా.. గతంలో ఇలాంటి సర్జరీ కారణంగానే టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా కన్నుమూశారు. నువ్వు నాకు నచ్చావ్, నువ్వులేక నేను లేను, సోగ్గాడు, వెంకీ, అడవి రాముడు వంటి హిట్ సినిమాల్లో ఆర్తి అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.