Ys Jagan : జగన్ నేతల పై ఆధారపడటం లేదా? అందుకే కొత్త స్ట్రాటజీకి దిగుతున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేగం పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావడంతో ఇక జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేగం పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావడంతో ఇక జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే కొత్త నేతలకు కూడా అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ఇక పార్టీలోకి తిరిగి తీసుకోకుండా వారి స్థానంలో యువనేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నిన్న జరిగిన పార్టీ యువజన విభాగం నేతలతో జరిగిన సమావేశంలో మంచి నేతలను గుర్తించి పార్టీలోకి తీసుకు రావాలని అనడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటి వరకూ ఇన్ ఛార్జులను నియమించకపోవడంతో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కొత్త తరం నేతలకు...
వైసీపీ ఖచ్చితంగా ఈ సారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్న జగన్ అందుకు అనుగుణంగా కార్యకర్తలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. యువజన విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు పార్టీ అనుబంధ విభాగాలను కూడా మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేసులకు భయపడి వెనుకంజ వేయవద్దని పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇస్తూ ఇక ఎఫెన్స్ లో వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకుంటున్నట్లు తెలిసింది. అందుకే యువకులతో పాటు విద్యార్థి విభాగాన్ని కూడా బలోపేతం చేయడంతో పాటు మహిళ విభాగాన్ని కూడా మరింతగా శక్తిమంతం చేసి అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేయాలన్న యోచనలో ఉన్నారు.
అనుబంధ సంఘాలను...
త్వరలోనే వైఎస్ జగన్ వైసీపీ విద్యార్థి విభాగం, మహిళ విభాగం నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరొక వైపు జగన్ తాను స్వయంగా సమస్యలపై జిల్లాలను పర్యటిస్తూ పార్టీకి మరింత హైప్ తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ వర్గాన్ని దూరం చేసుకోకుండా దగ్గరకు తీసుకునే యత్నంలోనే జగన్ ఉన్నట్లు కనపడుతుంది. గుంటూరులో మిర్చిరైతులు, పొదిలిలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం వెళ్లి వారితో మాట్లాడిన జగన్ తాజాగా ఈనెల 9న చిత్తూరు జిల్లా మామిడి రైతులతో కూడా సమావేశం కానున్నారు. ఇలా జిల్లా పర్యటనలతో పాటు మరొకవైపు పార్టీ అనుబంధ విభాగాలపై కూడా ఫోకస్ పెట్టారు.
సోషల్ మీడియా వింగ్ ను...
వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను కూడా బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెడుతున్నారని, అయినా బెదరకుండా పనిచేసిన వారికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ వస్తున్నారు. వైసీపీకి సోషల్ మీడియా బలం ఎక్కువ అన్న నేపథ్యంలో ఇటీవల అక్రమ కేసులతో కొంత వెనకబడి ఉండటాన్ని గమనించిన జగన్ ఆ దిశగా వారికి ధైర్యాన్ని కల్పించి, కేసులు వస్తే తాము అండగా ఉంటామని చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ నేతలపై జగన్ ఆధారపడకుండా ఇక అనుబంధ విభాగాలను బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు కనపడుతుంది.