మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం : సీన్ లోకి రాజకీయ నేతలు

నిందితుడు ఆవుల సతీష్.. పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుకి స్నేహితుడు కావడంతో.. కేసు అవ్వకుండా మాఫీ చేయించారని కొల్లు..

Update: 2023-06-19 11:07 GMT

kollu ravindra vs perni nani

మచిలీపట్నంలో ప్రభుత్వ హాస్టల్ లో ఉంటున్న ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తను నిందితుడిగా గుర్తించారు. నిందితుడిని అధికారపార్టీకి అండ ఉందన్న ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష నేతలు స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరుడు ఆవుల సతీష్ హాస్టల్ విద్యార్థినిని బైక్ ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళ్లి, డ్రగ్స్ ఇంజెక్షన్ చేసి, మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.

నిందితుడు ఆవుల సతీష్.. పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుకి స్నేహితుడు కావడంతో.. కేసు అవ్వకుండా మాఫీ చేయించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. పార్టీ పరువును కాపాడుకునేందుకు పేర్ని నానినే కేసును మాఫీ చేయించారన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు హైడ్రామా నడిపి.. కేసు మాఫీ చేసి.. విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, నిందితుడిని శిక్షించి బాధిత బాలికకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల గొంతులు నొక్కడం, నిర్బంధించడం, కేసులు పెట్టి వేధించడం, అరెస్టులు చేయడంపై మాత్రమే పోలీసులు శ్రద్ధ పెట్టి ఆడపిల్లల మాన, ప్రాణాలను గాలికొదిలేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తే సిగ్గులేకుండా శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని మభ్యపెడుతున్నారన్నారు. నోరు తెరిస్తే నా అక్కలు, నా చెల్లెలు, నా తల్లులు అని వాగే ప్రబుద్ధుడు వాళ్లకు రక్షణ కల్పించకుండా ప్యాలెస్ ఇనుప కడ్డీలు, పరదాల చాటున దాక్కున్నారని దుయ్యబట్టారు. ఈ బాలికపై జరిగిన అఘాయిత్యానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించకుంటే..సమరశీల పోరాటాలు తప్పవని హెచ్చరించారు. మచిలీపట్నంలో జరిగిన ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News