Rain Alert : ఏపీలో మొదలయిన వర్షం.. నీట మునిగిన సిక్కోలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ లో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ లో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తూ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు మొదలయ్యాయి.ఈరోజు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అనేక జిల్లాల్లో వర్షాలు...
అలాగే ఈరోజు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలని...
కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదిగ్భంధలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ చిక్కుకుపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.