Ys Jagan : ఎందరు వెళ్లినా జగన్ కు నష్టం జరుగుతుందా? సింపతీ పెరుగుతుందా?
ప్రత్యర్థుల వ్యూహాలు జగన్ కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ కు ఖచ్చితంగా సింపతీ వస్తుందని భావిస్తున్నారు
ప్రత్యర్థులు చేస్తున్న వ్యూహాలు జగన్ కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ కు ఖచ్చితంగా సింపతీ వస్తుందని భావిస్తున్నారు. జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ వెంట ఉన్న వారిని టార్గెట్ చేయడం ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు నాయుడును వదలిపెట్టి అనేక మంది పార్టీలు మారి వెళ్లిపోయారు. అయితే ఆయన పార్టీకి 2024 ఎన్నికల్లో ఏమీ కాలేదని, అంతకంటే అద్భుతమైన విజయం దక్కిందన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీని వీడటం మాత్రం క్యాడర్ లో సయితం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ధైర్యమున్న నేతగా...
ఎందుకంటే విజయసాయిరెడ్డి అందరి లాంటి నేత కాదు. ధైర్యమున్ననేత. తొలి నుంచి జగన్ వెంట నడిచిన లీడర్. జగన్ తో పాటు జైలుకు వెళ్లిన నాయకుడు. అలాంటి నాయకుడు డీలా పడ్డారంటే మిగిలిన శ్రేణులు కూడా కొంత భయపడతాయి. అయితే ఇప్పటికే జగన్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు అందలమెక్కించిన వారంతా పార్టీని వీడి వదిలి వెళ్లిపోతుండటం కొంత సింపతీ జగన్ పై వచ్చే అవకాశముంది. నిన్నటి నుంచే సోషల్ మీడియాలో జగన్ కు మద్దతుగా ప్రచారం జరుగుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనక ఎవరు ఉన్నారన్న విషయం దాడిపెట్టినంత మాత్రాన దాగేది కాదు. ఎందుకు రాజీనామా చేశారన్న విషయమూ సులువుగానే అర్థమవుతుంది.
జగన్ వీడి వెళ్లినా...
ఇప్పుడు కీలక నేతలు జగన్ ను వదలి వెళ్లిపోయినంత మాత్రాన జనంలో జగన్ పట్ల సానుకూలత పెరగదని ప్రత్యర్థులు వేస్తున్న అంచనాలు మాత్రం తలకిందులవుతాయని చెప్పాలి. విజయసాయిరెడ్డి లాంటి నేత వెళ్లినంత మాత్రాన పార్టీకి, జగన్ కు ప్రత్యేకంగా జరిగే నష్టం లేకపోయినా ఒక రాజ్యసభ పదవి మాత్రం పార్టీ చేజారి పోతుంది. కానీ మరో నాలుగేళ్లు వెయిట్ చేస్తే మళ్లీ రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంది. విజయసాయి రాజీనామాకు ఆయనకు చాలా కాలం పాటు రాజ్యసభ పదవి ఉండటంతో పాటు జగన్ ను మానసికంగా దెబ్బకొట్టాలన్న ప్రత్యర్థుల వ్యూహం వారికే బెడిసి కొట్టే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.
అధికారం దూరం అయినా...
ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పార్టీని వీడినప్పుడు కూడా ఆయననే జనం చీదరించుకున్నారు. తప్పించి జగన్ ను పన్నెత్తు మాట అనలేదు. క్యాడర్ లో కూడా జగన్ పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది. సాధారణ ఓటర్లలోనూ సానుభూతి పెరుగుతుంది. పార్టీలను నేతలు వీడిపోయినంత మాత్రాన బలహీనపడే అవకాశం లేదు. దానికి 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోనూ 2014 నుంచి 2023 వరకూ అధికారంలోని లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నాయకులు పార్టీని వీడినంత మాత్రాన ఒక పార్టీకి జరిగే నష్టం దీర్ఘకాలంగా ఉండదు. అది స్వల్పకాలం మాత్రమే. విజయసాయిరెడ్డి అయినా అంతే.. మరొకరు అయినా అంతే.