ఆవిడ ఎంట్రీతోనే ఎన్టీఆర్‌కు చీకటి రోజులు

వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిపై టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ జీవితంలో చీకటి

Update: 2023-05-28 11:46 GMT

వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిపై టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ జీవితంలో చీకటి రోజు.. లక్ష్మీ పార్వతి ప్రవేశించిన రోజేనని అన్నారు. ఆమె ముందు అది తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఎన్టీఆర్‌ కొడుకులు, కూతుళ్లు.. ఆయనకు వారసులేనని అన్నారు. అందుకే కొడుకులకు, కూతుర్లకు సమాన హక్కులు కల్పించారని బుద్ధా వెంకన్న అన్నారు. నారా భువనేశ్వరి భర్తగా, ఎన్టీఆర్‌ అల్లుడిగా చంద్రబాబుకు కూడా వారసత్వం ఉందని నొక్కి చెప్పారు.

లక్ష్మీ పార్వతి వల్లే ఆనాడు టీడీపీలో ముసలం ఏర్పడిందన్నారు. అందుకే టీడీపీలో నాయకులు ఉండకుండా బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. గడిచిన 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో చంద్రబాబు తెలుగు దేశం పార్టీని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతిని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయవాడలో ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి సభలో ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్‌కు కష్టకాలంలో అండగా నిలిచిన దేవినేని నెహ్రూ అసలైన వారసుడని అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తన గొంతును అప్పట్లో ఓ మీడియా అడ్డుకుందని, సీఎం జగన్‌ వల్ల తన గొంతును ఇప్పుడు చాలా మంది వింటున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌కు తామే వారసులమంటూ చాలామంది డబ్బాలు కొట్టుకుంటున్నారని, కడుపున పుట్టినవాళ్లే వారసులు కారని, కడవరకు అండగా నిలిచిన వారే వారసులు అని స్పష్టం చేశారు. నోటి మాట రాని లోకేష్ కూడా వారసుడిని అంటున్నాడు అంటూ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఫైర్‌ అవుతున్నారు. 

Tags:    

Similar News