Kanna Lakshminarayana : కన్నా పార్టీ మారడమే కొంప ముంచిందా? అదే చేటు తెచ్చిపెట్టిందా?

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తుంది

Update: 2025-06-20 07:29 GMT

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం సీటు దక్కుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ నాయకత్వం ఆయనను దూరం పెట్టి మరీ వచ్చే ఎన్నికలకు ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడకపోవచ్చంటున్నారు. అందుకు అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వయసు రీత్యానే కాకుండా ఇక జనంలో పెద్దగా తిరగలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీలో అంతా యువత మంత్రమే ప్రధానంగా వినిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న గుంటూరు జిల్లాలో టీడీపీ హైకమాండ్ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అది నిజంగా వారికి వరంగానే చెప్పాలి.

తిరుగులేని నేతకు...
సీనియర్ నేతగా, కాపు సామాజికవర్గంగా కన్నా లక్ష్మీనారాయణకు తిరుగులేదు. ఎందుకంటే ఒకప్పుడు కాపు సామాజికవర్గానికి కన్నాయే బ్రాండ్ అంబాసిడర్. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదికూడా పోయింది. కాపు నేత అంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ మాత్రమే ఆ సామాజికవర్గానికి కనపడుతున్నారు. ఇక జిల్లా కూడా కన్నా లక్ష్మీనారాయణకు ఇబ్బంది కరంగా మారింది. కమ్మ సామాజికవర్గం నేతలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రధానంగా టీడీపీలో ఉంటే జిల్లా పార్టీపై కూడా పట్టు చిక్కే అవకాశం లేదు. ఎందుకంటే సీనియర్ నేతలు ఎందరో ఈ జిల్లాల్లో పసుపు పార్టీలో ఉండటంతో పాటు వారి మాట చెల్లుబాటు అవుతుంది తప్పకన్నామాటను ఎవరూ ఖాతరు చేయరు.
బీజేపీ నుంచి టీడీపీలోకి...
రాయపాటి సాంబశివరావు వంటి బలమైన నేతలనే వయసు ప్రభావంతో ఆయనను పార్టీ పక్కన పెట్టేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఆ పదవీకాలం పూర్తికావడంతో పాటు తనకు రాజకీయ పదవులు ఏవీ దక్కవన్న నిర్ణయానికి వచ్చిన కన్నా 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి నియోజకవర్గం టిక్కెట్ ను పార్టీ ఇచ్చింది. గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించినా, ఆయనకు దక్కకపోవడానికి అనేక కారణాలున్నాయి. సామాజికవర్గంతో పాటు జిల్లాలో అప్పటికే కీలక నేతలకు మంత్రి పదవులు దక్కడంతో కన్నా ఆశలు గల్లంతయ్యారు.
వచ్చే ఎన్నికల నాటికి...
ఇకవచ్చే ఎన్నికల నాటికి కన్నా స్థానంలో కోడెల శివరాం పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయని పార్టీ లో పెద్ద టాక్ నడుస్తుంది. ఎందుకంటే గుంటూరుజిల్లాలోకమ్మ సామాజికవర్గంలో కోడెల కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేసిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. కోడెల శివప్రసాద్ కు పల్నాడుజిల్లాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబాన్ని చేరదీయకపోవడంపై కమ్మ సామాజికవర్గంలో అగ్రస్థానం లో ఉన్న వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టిక్కెట్ ను కోడెల శివరాంకు టిక్కెట్ ఇచ్చే అవకాశముంందని చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్య పెరిగినా కూడా టీడీపీ వచ్చే ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ఉందని,అందువల్ల కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి కూడా దూరం అవుతుందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. మరి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందన్నది చూడాలి.
Tags:    

Similar News