తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేది ఎప్పుడంటే?

ఏపీలో మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని

Update: 2023-06-17 03:07 GMT

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదు. ఏపీలోనే నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. గత నాలుగు రోజులుగా ముందుకు కదలడం లేదు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తీవ్ర పెను తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడిపోయి ఏపీలోనే ఆగిపోయాయి. దీంతో తెలంగాణను ఆలస్యంగా తాకనున్నాయి. జూన్ 19 నాటికి తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి తెలిపారు. 19వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అవకాశముందని అంచనా వేశారు. ఆ రోజున చేరుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు తాకగానే వెంటనే వర్షాలు పడవని, తొలకరి మొదలవ్వడానికి కొద్దిరోజుల సమయం పడుతుందని వాతావరణశాఖ చెబుతోంది. జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రతి ఏడాది రుతుపవనాలు చేరుకుంటాయి. రుతుపవనాల ఆలస్యం వల్ల తెలంగాణలో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత పెరగనున్నాయి.

ఏపీలో మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ నెల 19 నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శనివారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News