Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్..రెండు అల్పపీడనాలు రెడీ
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావంతో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని తెలిపింది. అయితే ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. అల్పపీడనం వాయుగుండంగా మారి తుపాను గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26, 27 తేదీ నాటికి తుపానుగా మారే అవకాశమున్నందున మరో రెండు, మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. అంతేకాకుండా బలమైన ఈదురుగాలులు కూడా కురిసే అవకాశముందని హెచ్చరించింది.
రేపటి నుంచి వానలు...
ఆంధ్రప్రదేశ్ లోతుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు ఈ నెల 26వ తేదీ నుంచి చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 27వ తేదీ నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించింది. రైతులు తమ పంటలను కోతకు వస్తే ముందుగానే వాటిని పొలాల్లో నుంచి తొలగించి సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఈదురుగాలులు బలంగా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణలో చలి తీవ్రత...
తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువవుతుందని పేర్కొంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తుపాను ప్రభావంతో ఈ వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని అంచనా వేసింది. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.