Janasena : ఉన్నది ఉంచుకుంటే చాలు బాసూ.. లేనిపోని పోకడలకు పోతే?
జనసేన పార్టీ జాతీయ పార్టీ అవుతుందని ప్రకటించి పవన్ కల్యాణ్ ముందుగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయాలని అంటున్నారు
జనసేన పార్టీ జాతీయ పార్టీ అవుతుందని ప్రకటించి పవన్ కల్యాణ్ మరో బీఆర్ఎస్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చి తర్వాత అత్యాశతో జాతీయ పార్టీగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రసమితిగా పేరు మార్చి 2023 ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు. జనం ఓడించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ముందు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని విస్తరణపై దృష్టి పెట్టాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ కూడా తాను జాతీయ పార్టీ అవుతుందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు కొన్ని జిల్లాల్లో పార్టీకే దిక్కులేని పరిస్థితుల్లో జాతీయ పార్టీగా ఎలా మారుతుందని ప్రశ్నిస్తున్నారు.
జనంలోకి వెళ్లలేక...
పవన్ కల్యాణ్ జనంలోకి పెద్దగా వెళ్లలేరు. ఆయనకు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆయన మిగిలిన రాజకీయ పార్టీల అగ్రనేతల తరహాల్లో రోడ్ షోలు, ప్రజల్లోకి వెళ్లడం వంటివి చేయలేరు. ఆయనను తాకాలని ఫ్యాన్స్ తపించిపోతుంటారు. గతంలోనూ అనేక సమయంలో పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగాయి. ఒక సమయంలో ఆయనను కూడా అభిమాని నెట్టివేయడంతో కారుపై నిల్చున్న పవన్ కల్యాణ్ పడిపోయారు. ఇలాంటి ఘటనల తర్వాత ఆయన ఇంటర్నల్ మీటింగ్ లు, బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో పాటు ఆయన ఎక్కువగా పర్యటనలు చేయడానికి కూడా సుముఖత చూపరు. అవసరమైన సమయంలో తప్పించి జనంలోకి రారన్న విమర్శలు పవన్ కల్యాణ్ పై ఉన్నాయి.
రెండు సార్లు పోటీ చేసి...
2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2019 ఎన్నికల్లో తొలిసారి కమ్యునిస్టులు, బీఎస్పీలతో కలసి పోటీ చేసి సింగిల్ స్థానం కూడా సాధించలేకపోయారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడటంతో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఆయన ప్రజలలోకి వెళ్లడం తక్కువ సార్లే అని చెప్పాలి. గెలిచిన ఏడాది తర్వాత విశాఖలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ గెలిచిన నియోజకవర్గాల్లోనే అయన పర్యటించలేదు.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన కు బూత్ లెవెల్ కమిటీలు లేవు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ జాతీయ పార్టీ అని చెప్పడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో విస్తరణకు...
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో తమను కోరుకుంటున్నారని, తనను అభిమానించే వారేనని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తనకు సిద్ధాంతాలను ఉన్నాయని వాటి ప్రకారమే తాను జనసేన పార్టీని జాతీయ పార్టీగా మలుస్తానని ఆత్మవిశ్వాసంతో పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ పార్టీలను కాదని మీకు అండగా నిలిచే అవకాశం లేదన్నది కూడా వాస్తవం. అయితే ముందు పొరుగున ఉన్న తెలంగాణలో కనీసం పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉండి, అభిమానులు, కులానికి సంబంధించిన వాళ్లు అత్యధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే సొంతంగా ఎదగలేని, పోటీ చేసినా గెలవలేని పరిస్థితుల్లో ఉన్న పవన్ కల్యాణ్ జాతీయ పార్టీ అని చెప్పి చేతులు కాల్చుకోవడమేనని అంటున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ లో జనసేను బలోపేతం చేయాలని పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అత్యాశకు, అనవసర రాద్ధాంతాలకు పోయి పార్టీని జాతీయ పార్టీగా మలచి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దని హితవు కూడా పలుకుతున్నారు.