Janasena : పవన్ సిగ్నల్స్ ఇప్పటికైనా అర్థమయ్యాయా?
Janasena : పవన్ సిగ్నల్స్ ఇప్పటికైనా అర్థమయ్యాయా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదిహేనేళ్ల నినాదం వెనక చాలా వ్యూహం ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ పదే పదే పదిహేనేళ్ల పాటు కూటమి కలసి ఉంటుందని చెబుతూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ పెట్టే షరతులు కూడా మారతాయంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే పవన్ కల్యాణ్ గౌరవంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులను ఇబ్బందిపెట్టే విధంగా మాట్లాడినా మిత్రధర్మం కోసం పవన్ కల్యాణ్ సహిస్తూ కూటమి విచ్ఛిన్నం కాకపోవడానికి తానే కారణమని గట్టిగా చెప్పదలచుకున్నారు. ఇప్పటి వరకూ మిత్రపక్షాల్లో ఉన్న టీడీపీ నేతలు మాత్రమే జనసేన పై కొంత నోరు జారారు.
కొంత టోన్ మార్చినా...
అదేసమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం చాలా వరకూ సంయమనం పాటిస్తూ వస్తున్నారు. అందుకు దూరాలోచన కారణమన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించిన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగారు. కీలకమైన పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ వంటివాటిని ఏరికోరి తీసుకున్నారు. అంతేకాదు కొన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను కూడా మంత్రి మండలి సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. గతంలో అమరావతి రాజధాని రైతుల నుంచి అదనపు భూముల విషయంలో అభ్యంతరాలు తెలపడంతో పాటు ఇటీవల లూలూ సంస్థ పెట్టిన షరతులను కూడా ప్రశ్నించి తాను అవసరమైనప్పుడు ప్రశ్నిస్తానని సిగ్నల్స్ అధికార టీడీపీకి ఇవ్వగలిగారు.
అనుభవం లేకపోవడంతో...
మరోవైపు 2024 ఎన్నికల వరకూ ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదు. దీంతో అనుభవం లేకపోవడంతో సీట్ల పంపకంలో గాని, చివరకు మంత్రి పదవుల విషయంలోగాని ఒకింత రాజీ పడ్డారు. తాను తక్కువ సంఖ్యలో సీట్లు తీసుకున్నానని ఆయనకు తెలుసు. జనసైనికులకే కాదు తన అభిమానులకు కూడా అది నచ్చదని తెలిసినా చంద్రబాబు అనుభవానికి పెద్దపీట వేయాలని సహకరించారు. ఇకపై అలా ఉండదంటున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఎటూ వచ్చే ఎన్నికల నాటికి ఐదేళ్ల అనుభవం ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో షరతులు ఉంటాయన్నది జనసైనికుల నుంచి వినిపిస్తున్నమాట. అలాగే సీట్ల విషయంలోనూ రాజీ ఉండదన్న అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. తనకు కూటమి కలసి ఉండటం ఎంత అవసరమో టీడీపీకి అంతకంటే ఎక్కువ అవసరం కావడంతో ఈరోజు షరతులు వర్తిస్తాయని జనసైనికులు బాహాటంగానే చెబుతున్నారు.