వారందరూ కాటికి కాలు చాపినట్లే: ఎమ్మెల్యే వల్లభనేని

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ

Update: 2023-06-11 09:31 GMT

వారందరూ కాటికి కాలు చాపినట్లే: ఎమ్మెల్యే వల్లభనేని

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే విమర్శిస్తున్న వారందరూ కూడా కాటికి కాలు చాపినోళ్లేనని అన్నారు. ఆదివారం నాడు గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని మాట్లాడారు. ఊరు పొమ్మంటుంది.. కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. గన్నవరం నియోజకవర్గంలో 27 వేల మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, అందులో ఎక్కువ శాతం మంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు.

అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆత్మ గౌరవాన్ని ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కొంత మంది విమర్శిస్తున్నారని, వాళ్లు పనికి మాలిన సన్నాసులు అని అన్నారు. అమ్మపెట్టదు.. అడుక్కు తిననివ్వదన్న రితీలో చంద్రబాబు శైలి ఉందన్నారు. గత ప్రభుత్వం తన పాలనా కాలంలో ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు తాము పేదలకు సెంటు భూమి ఇస్తుంటే చూసి విమర్శిస్తున్న వారికి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలని ఎమ్మెల్యే వల్లభనేని ఘాటుగా మాట్లాడారు. ఒక వేళ గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి తమను ప్రశ్నిస్తే బాగుండేదన్నారు.

ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే పేదల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. అవసరం లేకున్నా పేదవాడు రెండో ఇల్లు ఎందుకు కట్టుకుంటాడని అన్నారు. రాజకీయ కారణాలతో విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం మంచి చేసినా ఒప్పుకోవాల్సిందేనన్నారు. పోలవరం కుడి కాలువ మూలాన తమ నియోజకవర్గానికి మంచి జరిగిందని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆ కాలువను 86 శాతం పూర్తి చేస్తే, గత ప్రభుత్వం 14 శాతం కాలువను పూర్తి చేసిందన్నారు. వైఎస్‌ఆర్‌, చంద్రబాబు మూలాన ఈ నియోజకవర్గానికి మంచి నీళ్లు వచ్చాయి. ఈ నిజం ఎవరూ కాదనలేనిదని అన్నారు.  

Tags:    

Similar News