Rain Warning : ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పుతో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో కుండపోత వానలు పడతాయని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని పేర్కొంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు ముంచెత్తి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తాయని కూడా చెప్పింది. పిడుగులు పడే అవకాశముందని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వెల్లడించింది. ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తాయని కూడా పేర్కొంది.
ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే నంద్యాల, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పల్నాడు జిల్లాకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. అత్యధిక సెంటీమీటర్లతో వర్షం పడటమే కాకుండా, పిడుగులు పడతాయని ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని కూడా సూచనలు జారీ చేసింది. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెడ్ అలెర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కోరింది.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో పాటు మరో అల్పపీడనం కూడా పొంచి ఉండటంతో వానలు కంటిన్యూ అవుతాయని ప్రకటించింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే కామారెడ్డి, మెదక్,సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి,సిద్ధిపేట, జనగాం,హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.