Jana Sena : జనసేన ఎమ్మెల్యే పై కుట్ర జరుగుతుందా? "లోకం" తీరు మారదా?

జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి కూటమి పార్టీలోని నేతలకు అస్సలు పడటం లేదు.

Update: 2025-11-05 07:08 GMT

జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి కూటమి పార్టీలోని నేతలకు అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి లోకం నాగ మాధవి జనసేన టిక్కెట్ తెచ్చుకున్నారు. కూటమి పార్టీల ఐక్యతతో మాధవి నెలిమర్ల నుంచి గెలుపొందారు. అయితే గెలిచిన నాటి నుంచి లోకం మాధవికి, నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. టీడీపీ నేతలను కేర్ చేయకపోవడంతో పాటు తనకు కావాల్సిన వారికే పనులు కట్టబెట్టడం వంటివి మాధవిపై టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించాయి. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో లోకం మాధవికి వ్యతిరేకంగా కూటమిలోని మిత్రులే పోస్టులు పెడుతున్నారు.

అధికారులకు ఆదేశాలివ్వడంతో...
అధికారులకు కూడా ఎమ్మెల్యే మాధవి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. తాను తప్ప ఎవరేం చెప్పినా పనులు చేయవద్దంటూ అందరి అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎవరి సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని కూడా హుకుం జారీ చేశారు. దీంతో ఈ విషయాన్ని టీడీపీకి చెందిన నాయకులు తమ పార్టీ నాయకత్వానికి, జిల్లా మంత్రికి కూడా తెలియజేసినా లోకం మాధవి డోన్ట్ కేర్ అంటుండటంతో ఏమీ చేయలేక నిస్సహాయతతో ఉండిపోయారంటున్నారు. అయినా సరే వచ్చే ఎన్నికల నాటికి లోకం మాధవిని పూర్తిగా సైడ్ చేసే పనిలోనే కూటమి పార్టీలోని నేతలు ఉన్నారన్నది మాధవి అనుచరులు చెబుతున్నారు. కానీ మాధవి మాత్రం తగ్గేదేలేదంటూ తన పని తాను చేసుకు వెళుతున్నారు.
తాజా ఘటన వెనక కూడా...
తాజాగా జరిగిన ఘటన వెనక కూడా కూటమి నేతల ప్రమేయం ఉందని మాధవి అనుమానిస్తున్నారు. లోకం మాధవిపై మత్స్యకారులు తిరగబడ్డారు. తుపాను సమయంలో తమకు రేషన్ అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్లిన లోకం మాధవిని అడ్డుకున్నారు. పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అందరికీ ఓకేలా పరిహారం, రేషన్ అందించాలని, వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. దీంతో లోకం మాధవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే జనసేన నేతలు మాత్రం మత్స్యకారుల వెనక కూటమి పార్టీలకుచెందిన నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. జనసేనను నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు కూటమి పార్టీలోని మిత్రులే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి కూటమి నేతల మధ్య కీచులాటలు ఎక్కడకు దారితీస్తాయన్నది క్యాడర్ లో ఆందోళన కలిగిస్తుంది.


Tags:    

Similar News