నా దగ్గర ధనం లేదు.. ధైర్యం ఉంది
తన వద్ద అపరిమితమైన ధనం లేదని, ధైర్యం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు
ఎన్టీఆర్ మహానటుడితో మనం పోటీ పడలేం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ధైర్యంగా మార్పు కోసం తాను పార్టీ పెట్టానని ఆయన తెలిపారు. విజయవాడలో లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అయితే 2014లో పార్టీని పెట్టానని చెప్పారు. అణగారిన, వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని మాట ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒక మార్పు కోసమే తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి కష్టాలు రాకుండా ఉండవని ఆయన అన్నారు. తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం రాజకీయాల్లోకి రావడం అని అన్నారు.
ప్రజల కోసం పనిచేయాలన్న....
2019 ఓటమి తర్వాత తాను పార్టీని వదిలిపెట్టి వెళతానని అందరూ భావించారన్నారు. కానీ ధైర్యంతో ముందుకు సాగుతున్నానని పవన్ తెలిపారు. వెంటనే అధికారం చేపట్టాలని తనకు లేదన్నారు. తన వద్ద అపరిమితమైన ధనం లేదని, ధైర్యం ఉందని పవన్ చెప్పారు. ప్రజల కోసం పనిచేయాలన్న తపన ఉందని తెలిపారు. ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. అమరావతి రాజధానిగా అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించి ఇప్పుడు మాట తప్పారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే చట్టాలను అమలు చేసే హక్కు మీకెక్కడిది అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో అవకాశముంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అవకాశముండేది అని ఆయన అన్నారు.