Janasena : ఊరమాస్ వార్నింగ్ లు ఉత్తుత్తిదేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడప జిల్లాలో క్యాంప్ కార్యాలయం పెడతానని దాదాపు కొన్ని నెలలు గడుస్తుంది

Update: 2025-08-15 07:01 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడప జిల్లాలో క్యాంప్ కార్యాలయం పెడతానని దాదాపు కొన్ని నెలలు గడుస్తుంది. అయితే ఇప్పటి వరకూ కడప జిల్లాలో క్యాంప్ కార్యాలయం పెట్టింది లేదు. ఆయన వెళ్లింది లేదు. ఈ ఏడాది జనవరిలో ఆయన కడపలో పర్యటించిన సందర్భంగా చేసిన ప్రకటన ప్రకటనకే పరిమితమయినట్లుగా కనపడుతుంది. దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా కడపలో క్యాంప్ కార్యాలయం పెట్టలేదు. పవన్ కల్యాణ్ ఆ ఊసే మర్చిపోయినట్లుంది. తాను ప్రజల్లోకి వెళ్లి బహిరంగంగా చేసిన ప్రకటనను కూడా పట్టించుకోకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయింది. కడప ప్రాంతంలో పర్యటించినప్పుడు ఉండే జోష్ తర్వాత పవన్ కల్యాణ్ లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు మాత్రం జవాబు లేదు.

మాటకు కట్టుబడి ఉండేలా...
అన్నమయ్య జిల్లాలోని గాలివీడు తహశీల్దారును పరామర్శించడానికి కడప వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఊరమాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తర్వాత మాత్రం ఆ మాస్ వార్నింగ్ ను కడప సరిహద్దుల్లోనే వదిలేసినట్లుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ ఏదైనా ఆ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండరని, అక్కడ పరిస్థితులను బట్టి తన మనసులో తోచిన విషయాన్ని ఆవేశంగా బయటకు చెబుతారని, అంతే తప్ప ఆచరణ సాధ్యం కాని విషయాలను కూడా చెప్పి జనం ముందు నవ్వుల పాలు అవుతున్నారని జనసైనికులే అంటున్నారు. అందుకే ఒక మాట చెప్పేముందు అన్నీ ఆలోచించుకుని చేయాల్సి ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
గతంలో చెప్పిన మాటలు...
గతంలోనూ పవన్ కల్యాణ్ చేసిన అనేక వ్యాఖ్యలు, హామీలను కూడా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మాటలపై నమ్మకం కలగాలంటే కనీసం తాను చెప్పిన మాటలను అయినా నిజం చేయాలని, కనీసం కడపలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఉన్న అభ్యంతరాలేమిటి? అని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు. అందుకే పవన్ కల్యణ్ ఇకపై ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచరణ సాధ్యమా? తన కున్న పరిధిలో అది వీలవుతుందా? అన్నది ఆలోచించుకోవాలంటున్నారు. రాయలసీమలో పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఇంతవరకూ మొదలు పెట్టకపోవడంపై కూడా జనసైనికుల్లో అసంతృప్తి కనపడుతుంది. మరి పవన్ ఇప్పటికైనా సీమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
Tags:    

Similar News