Chandrababu : ఏడాది పాలన ఏమి ఇచ్చింది? ఏం తెచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి నేటికి ఏడాది కావస్తుంది

Update: 2025-06-12 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి నేటికి ఏడాది కావస్తుంది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తో పాటు దాదాపు ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నేటికి ప్రభుత్వం పాలనచేపట్టి ఏడాది పూర్తి కావస్తుంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఏడుపదుల వయసు దాటనా ఏమాత్రం తగ్గలేదు. ఆయన గతంలో మాదిరిగా 18 గంటలు నిర్విరామంగా పనిచేయకపోతున్నప్పటికీ ఆయన పనితీరులో ఏమాత్రం రాజీపడటం లేదు. గత ఏడాది నుంచి ఆయన చేస్తున్న పర్యటనలు, చేస్తున్న సమీక్షలను చూస్తుంటే ఆయనను చూసి నేటితరం రాజకీయ నేతలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ టు విజయవాడ ఎన్ని సార్లు తిరిగారంటే అది రాష్ట్ర అభివృద్ధికోసమే. పది రూపాయలు ప్రయోజనం రాష్ట్రానికి ఉందంటే ఆయన ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. ఏడాది కాలంలో దాదాపు పది సార్లకు మించి ఢిల్లీకి వెళ్లి వచ్చారంటే ఆయన లో ఉన్న తపన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు. గతంలో పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తాజాగా ఏడాది పూర్తి చేసుకున్నారు.

ప్రొఫెషన్ గా చూసే...
రాజకీయాన్ని ఒక ఫ్యాషన్ గా కాకుండా క్రమశిక్షణతో ఒక ప్రొఫెషన్ గా తీసుకోవడం ఎలాగో చంద్రబాబు వద్ద నేర్చుకోవాలి. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా, నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన నిరంతర ధ్యాస రాజకీయమే. ప్రజలు ఇచ్చిన పదవిని ఎంజాయ్ చేయడంకాదు. దాంతో సేవ ఎలా చేయాలో నిరూపించిన నేత చంద్రబాబు నాయుడు. నిత్యం ప్రజలకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నాయకుడికి తిరుగు ఉండదని చంద్రబాబు నిరూపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం రాజకీయ నేతలందరూ టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. అయితేచంద్రబాబు లాంటి పని రాక్షసుడిలా ఎవరూ ఉండరు.
నేటికీ యువరాజకీయ నేతల్లాగానే....
గతంలో ఆయన కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. 2024 లో గెలిచిన తర్వాత మాత్రం కుటుంబానికి కూడా కొంత సమయం ఇవ్వడం చూస్తున్నాం. అందులో తప్పేమీ లేకపోయినా నేటికీ మూడు పదుల యువ రాజకీయనేతలాగానే జిల్లాలను అలా చుట్టివచ్చేస్తుంటారు. ఉదయం ఐదుగంటలకు మొదలయ్యే చంద్రబాబు దైనిందిన కార్యక్రమాలు రాత్రి వేళ ఎంత వరకూ సాగుతాయన్నది చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయన వివిధ శాఖలతో నిరంతరం సమీక్షలను నిర్వహిస్తూ, అధికారులను దిశానిర్దేశం చేస్తూ, తన విజన్ ను సాకారం చేయడానికి ఒప్పించి పనిచేయగలుగుతున్నారు. గతంలో మాదిరిగాచంద్రబాబు ఆకస్మిక తనిఖీలంటూ హడావిడి చేయకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ పనితీరులను ఎప్పటికప్పడు గమనిస్తూ వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రెండు లక్ష్యాలతో ముందుకు...
చంద్రబాబు నాయుడులో రోజంతా కష్టపడినా ఆయనలో అలసట అనేది కనిపించదు. ఇకచాలులే అన్న సంతృప్తి అస్సలు కానరాదు. అందుకే చంద్రబాబు రాజకీయాల్లో సక్సెస్ కాగలిగారు. నేటితరం నేతలు రెండు గంటలు ప్రజలు, నేతలతో ఉంటే నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఎక్కువగా ఆఫీసులకే పరిమితమవుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జనంలో ఉండటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఆయన కున్న లక్ష్యాలు రెండే రెండు. ఒకటి రాజధాని అమరావతిని నిర్మించడం. రెండోది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం. 2014 నుంచి ఆయన చెప్పుకునేందుకు ఎలాంటివి లేకపోవడంతో ఈ రెండింటినీ పూర్తి చేసి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంత్రులు కూడా ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆయన అలవాట్లను అలవర్చుకుంటేనే రాజకీయ భవిష్యత్ పదికాలాలపాటు ఉంటుంది. లేకపోతే పాలిటిక్స్ నుంచి ఫేడ్ అవుట్ అవుతారని గుర్తుంచుకోవాలి.
Tags:    

Similar News