మంచి జరిగిందనిపిస్తే.. మళ్లీ నాకే ఓటేయ్యండి: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమౌతున్నాయని

Update: 2023-05-24 08:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమౌతున్నాయని అన్నారు. తమ పాలనలో మంచి జరిగిందని భావిస్తే.. వచ్చే ఎన్నికల్లో తమకు మళ్లీ అండగా నిలవాలని రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ కోరారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన విద్యా దీవెన పథకంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేసింది.

విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగించారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎంతో ఉన్నతమైనవన్న సీఎం జగన్‌.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి దారి చూపిస్తుందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. లైఫ్‌లో హయ్యర్‌ పొజిషన్‌కి వెళ్లాలంటే అది ఒక్క విద్యతోనే సాధ్యమన్నారు. ఎన్నో ఏళ్ల తలరాతలు మారాలంటే విద్యా ఒక్కటే ఆయుధమన్నారు. తమ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లుగా విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

గత పాలకులు గజ దొంగల ముఠా అని, వారి పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేదన్నారు. పేదోడికి, పెత్తందార్లకు మధ్యా క్లాస్‌ వార్‌ జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. గతంలో లంచాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు అందేవా? అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు. గత పాలకులు పేదవారి గురించి ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో గజ దొంగల ముఠా అబద్దాలతో ప్రజల ముందుకు వస్తుందన్నారు. రాష్ట్రం దివాళ తీస్తుందని ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రతి ఇంట్లో మంచి జరిగి ఉంటే మళ్లీ తనకే ఓటేయాలన్నారు. దేవుడి దయతో ఇంకా మంచి చేసే కార్యక్రమానికి ప్రజల మద్ధతు కావాలని సీఎం కోరారు.

Tags:    

Similar News