Chandrababu : దావోస్.. నుంచి తెచ్చేదెన్ని? ఏపీలో గ్రౌండ్ అయ్యేవి ఎన్నో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు మరోసారి వెళ్లారు

Update: 2026-01-20 07:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు మరోసారి వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు ఆయన తన బృందంతో కలసి బయలుదేరి వెళ్లారు. మొత్తం నాలుగు రోజుల పాటు చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన దావోస్ పర్యటనకు వెళ్లినప్పటికీ ఇప్పటికే కొన్ని విమర్శలు బయలుదేరాయి. గత ఏడాది దావోస్ లో పర్యటించి వచ్చిన చంద్రబాబు ఒక్క పరిశ్రమ కూడా తేకుండా తిరిగి ఏ రకంగా ఇప్పుడు మళ్లీ బయలుదేరి వెళ్లారంటూ వైసీపీ నేతలు సెటైర్లు అప్పుడే మొదలు పెట్టేశారు. గత ఏడాది జరిగిన దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తాము ఎవరితోనూ ఎంవోయూలు చేసుకోలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చారు.

గతం కంటే భిన్నంగా...
గతం కంటే భిన్నంగా చంద్రబాబు దావోస్ కు వెళ్లినప్పటికీ ఎంవోయూల విషయంలో ఉన్నదున్నట్లు చెప్పేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం పారిశ్రామికవేత్తలకు వివరించి వచ్చానని చెప్పుకొచ్చారు. తర్వాత నిదానంగా పరిశ్రమలు అవే వస్తాయని చెప్పారు. అయితే గత ఏడాది నుంచి కొన్ని పరిశ్రమలు ఏపీకి రావడంతో పాటు మౌలిక సదుపాయాలతో పాటు, భూముల్లో రాయితీలు, ప్రభుత్వ పరంగా అనేక రకాలుగా సాయం చేయడం వంటి వాటితో ఈసారి దావోస్ పర్యటనలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ, తిరుపతి, అనంతపురం, కర్నూలు, అమరావతి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారిని ఆహ్వానిస్తారని చెప్పారు.
ఇప్పటికే కొన్ని సంస్థలు...
ఏదైనా ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని టీడీపీ నేతలంటున్నారు. ఒకసారి వెళితే పరిశ్రమలు రాలేదని ఊరుకుంటామా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం మేరకు ఎక్కువగా విశాఖలో ఏర్పాటు చేయడానికి కొన్ని పరిశ్రమలు సుముఖంగా ఉన్నాయని, వాటితో ఎంవోయూలు ఈ పర్యటనలో చంద్రబాబు చేసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే తిరుపతి, అనంతపురం ప్రాంతంలోనూ కొన్ని పరిశ్రమల ఏర్పాటుకు మౌఖికంగా అంగీకారం తెలిపాయని, ఈసారి భారీ పెట్టుబడులతో చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి వస్తారని ధీమాగా తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు దావోస్ పర్యటన మరొకసారి రాజకీయంగా హాట్ హాట్ గా మారింది.
Tags:    

Similar News