BJP : "ఆది".. ఎవరి మాట వినరు.. నా ఇలాకాలో పనులన్నీ నావేనంటున్నారే

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2025-04-17 06:09 GMT

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆది నారాయణరెడ్డి వర్గం ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ నుంచి ఫ్లైయాష్ తీసుకువెళుతున్న లారీలను అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆల్ట్రాటెక్ పరిశ్రమలో కాంట్రాక్ట్ పనులు తమకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం డిమాండ్ చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఫ్లైయాష్ సరఫరాను ఎమ్మెల్యే వర్గీయులు వాటిని కదలనివ్వకుండా అడ్డుకోవడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఫ్లైయాష్ లారీలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో అల్ట్రాటెక్ పరిశ్రమల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో...
కడప జిల్లాలోని చిలమకూరు, ఎర్రగుంట్ల వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమలోకి సున్నపురాయిని తీసుకెళ్లే మార్గంలో ఆదినారాయణరెడ్డి అనుచరులు ఒక మినీ బస్సును నిలిపి మరీ దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత ఐదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా కాకపోవడంతో చిలమకూరు ప్లాంట్ లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయిందని ప్లాంట్ యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసింది. లారీలన్నీ నిలిచిపోవడంతో ఒకరకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలోనూ ఫ్లైయాష్ వివాదం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య తలెత్తింది.
తాజాగా మరోసారి...
అయితే చంద్రబాబు సమక్షంలో పంచాయతీ జరిగింది. అల్ట్రా సిమెంట్ పరిశ్రమలో కొన్ని కాంట్రాక్టు పనులను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులకే ఇచ్చినప్పటికీ అంతా తమకే కావాలంటూ ఆది అనుచరులు పట్టుబడుతున్నారు. బయట వారికి కాంట్రాక్టులు ఇస్తే ఒప్పుకోమని చెబుతున్నారు. లారీలను అడ్డుకుంటుండటంతో ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిపోయి యాజమాన్యం ఇబ్బందుల పాలవుతుంది. ఆదినారాయణరెడ్డి తన నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు పనైనా తన వాళ్లకే ఇవ్వాలంటూ నిబంధన పెట్టడంతో పాటు దౌర్జన్యంగా అడ్డుకుంటుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఫ్లైయాష్ తో పాటు సున్నపురాయిని సజావుగా పంపేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. ఆదినారాయణరెడ్డి వైఖరితో పార్టీతో పాటు కూటమి కూడా రాజకీయంగానే కాదు స్థానికంగా విమర్శలను ఎదుర్కొంటుంది.
Tags:    

Similar News