BJP : కమలంలో కడపోళ్ల కలహాల కాపురం చూడండయ్యా
కడప జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ లు స్ట్రీట్ ఫైట్ కు దిగారు
భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. సిద్ధాంతాలతో కూడిన పార్టీ అని అంటారు. ఆర్ఎస్ఎస్ భావాజలం నుంచి వచ్చిన వారు పార్టీ లైన్ దాటరు. అలాగే పార్టీ నిబంధనలకు అనుగుణంగానే వారు పనిచేస్తారు. అంతే తప్పించి ఎలాంటి వివాదాల జోలికి పోరు. కానీ నేటి బీజేపీ వేరు. ఇతర పార్టీల నుంచి అవసరాల నిమిత్తం వచ్చిన వారు కొందరైతే.. పార్టీ అవసరాల కోసం చేర్చుకున్న వారి చేరికతో మరికొందరు కమలం పార్టీ ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారయింది. ఒకరకంగా మిగిలిన పార్టీలను మించి బీజేపీ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతుంది. ముఖ్యంగా ఇద్దరు కడప నేతల మధ్య జరుగుతున్న సమరం ఎటు వైపునుకు దారితీస్తుందన్నది చూడాలి.
జమ్మలమడుగు నుంచి...
కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆదినారాయణరెడ్డి గెలిచారు. ఆయన తొలుత వైసీపీ, తర్వాత టీడీపీ, అనంతరం బీజేపీలో చేరిపోయారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంతో తనను తాను కాపాడుకోవడానికి కమలం పార్టీని ఆశ్రయించారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ పొందారు. అప్పటి నుంచి జమ్మలమడుగులో చీమ చిటుక్కుమన్నా తనకు తెలియకుండా జరగడానికి వీలులేదని శాసనం చేశారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫ్లైయాష్ వివాదం పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు, సొంత పార్టీకిచెందిన నేత సీఎం రమేష్ తో అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
లేఖ రాయడంతో...
ఇక సీఎం రమేష్ కూడా కడప జిల్లాకు చెందిన నేత. ఆయన మొన్నటి వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాలుమోపలేదు. తొలిసారి 2024 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి కమలం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సీఎం రమేష్ పేరుకు అనకాపల్లి అయినా తన వ్యాపారాలు, రాజకీయం అంతా కడప జిల్లాలోనే ఇంకా చేస్తున్నారు. తాజాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బంధువులను టార్గెట్ చేశారు. తన వ్యాపార సంస్థలపై ఆది అనుచరులు దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఆదినారాయణరెడ్డి బంధువులపై నేరుగా జిల్లా ఎస్పీకి లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు. ఇద్దరిదీ కడప జిల్లానే. కానీ ఇద్దరి మధ్య వైరం మామూలుగా లేదు.
సీఎం రమేష్ కు ఆది కౌంటర్...
జమ్మలమడుగు క్లబ్‌లో పేకాటపై సీఎం రమేష్ కడప కలెక్టర్ కు ఎస్సీకి లేఖ రాశారు. అయితే ఎంపీ సీఎం రమేష్ లేఖపై ఎమ్మెల్యేఆదినారాయణ కౌంటర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్‌ది దరిద్రపు ఆలోచనలు..దరిద్రపు లేఖ అని అన్నారు. సీఎం రమేష్ రాజకీయ కోణంలో ఇచ్చిన లేఖ అని కొట్టిపారేశారు. అధికారులు విచారణ చేయాలని తాను కూడా కోరానని తెలిపారు. అధికారుల విచారణలో ఒక్క పర్సెంట్ నిజమని తేలినా పేకాట నిర్వహిస్తున్న వారిని నేనే చెప్పుతో కొడతా అంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం రమేష్ నిర్మాణ సంస్థపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేసినందునే ఈ రకమైన లేఖలతో తనను బెదిరించాలని చూస్తున్నారని ఆదినారాయణ రెడ్డి సన్నిహితుల వద్ద అంటున్నారు. మొత్తం మీద కమలం పార్టీలోనూ ఇలా వీధిన పడి నేతలు కొట్లాటలకు దిగడం పార్టీలో చర్చనీయాంశమైంది.