Nara Lokesh : నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన వెనక ఉన్న రహస్యం అదేనా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చంద్రబాబుకు చేదోడుగా మారారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధానితో సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చంద్రబాబుకు చేదోడుగా మారారు. ఇటు పార్టీ విషయాల్లోనూ అటు ప్రభుత్వ సంబంధిత విషయాల్లోనూ తండ్రికి అలుపు తెలియకుండా తానే అన్నీ చక్కబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పార్టీపై లోకేశ్ కు పట్టు పెరిగింది. నారా లోకేశ్ ఎక్కడకు వెళ్లినా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. అలాగే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలు ఎంత మేరకు విజయానికి పార్టీని చేరువ చేశాయో.. లోకేశ్ రెడ్ బుక్ కూడా అంతే చేరువ చేసిందని చెప్పవచ్చు. లోకేశ్ తన యువగళం పాదయాత్ర ద్వారా రెడ్ బుక్ లో అందరి పేర్లను నోట్ చేసుకుంటున్నట్లు ప్రకటించి కార్యకర్తల్లో నాడు ఉత్సాహం నింపారు.
రెడ్ బుక్ తోనే...
ఇప్పుడు కూడా నారా లోకేశ్ ఎక్కడ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించినా రెడ్ బుక్ రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటుందని, రెడ్ బుక్ మూసివేయలేదని, తన తల్లిని అవమానించిన వారిని, తండ్రిని జైల్లో పెట్టిన వారిని, కార్కకర్తలను హత్య చేసిన వారిని, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలపెట్టబోనని హెచ్చరిస్తున్నారు. దీంతో కార్యకర్తలలో లోకేశ్ నాయకత్వంపై నమ్మకం మరింత పెరిగింది. నారా లోకేశ్ పట్టుకుంటే వదలిపెట్టడన్న సంకేతాన్ని బలంగా క్యాడర్ లోకి పంపుతున్నారు. కేవలం క్యాడర్ కు మాత్రమే కాదు నాయకులకు కూడా తాను చెప్పింది చేయాలని గట్టిగానే చెబుతున్నారు. నిన్న మంత్రి వర్గ సమావేశానికి ముందు మంత్రులతో సమావేశమై యూరియా కొరతపై వైసీపీ విమర్శలకు ఘాటు కౌంటర్లు ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు.
చంద్రబాబుకు చేదోడుగా..
ఇక చంద్రబాబు నాయుడు తరచూ ఢిల్లీకి వెళ్లి తిరిగి వస్తుండటం ఆయనకు ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ బాధ్యతను నారా లోకేశ్ ను తీసుకున్నట్లు కనపడుతుంది. ఇటీవల కాలంలో వరసగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి చంద్రబాబుపై వత్తిడి తగ్గించేందుకు నారా లోకేశ్ ఈ బాధ్యతలను భుజనాకెత్తుకుని హస్తిన పర్యటనలు వరసగా చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. మోదీతో జరిగిన ప్రత్యేక భేటీలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు వివిధ రకాల ప్రాజెక్టులు, రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారని తెలిసింది.
ఇప్పటికే రాజకీయంగా...
నారా లోకేశ్ ఇప్పటికే రాజకీయంగా రాటుదేలారు. ఇక మంత్రి పదవితో పాటు పార్టీని కూడా నడిపించడంలో తండ్రి నుంచి అన్ని విషయాలు తెలుసుకోగలిగారు. దీంతో పాటు తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో కార్యకర్తల సంక్షేమానికి కూడా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడమే కాకుండా, నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రతి రోజూ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. కేవలం పార్టీ, రాష్ట్రంతో మాత్రమే కాకుండా హస్తినతో కూడా సంబంధాలు మెరుగుపర్చుకుంటున్న లోకేశ్ పగ్గాలు చేపట్టే దూరం ఎంతో లేదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. చంద్రబాబు కుమారుడిగా, ఎన్టీఆర్ మనవడిగా టీడీపీని మరింత వేగంగా బలోపేతం చేస్తారని క్యాడర్ భావిస్తుంది.