Free Gas Cylinder : ఇప్పటి వరకూ ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్ చేసుకుంది ఎంతో తెలిస్తే?

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ పథకం దీపావళి నుంచి ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది

Update: 2025-02-19 11:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ పథకం దీపావళి నుంచి ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంటే గత ఏడాది నవంబరు 1వ తేదీ నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. ఆరోజు నుంచి ఉచిత గ్యాస్ ను అందిస్తున్నారు. ముందుగా గ్యాస్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే తర్వాత ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో వారు చెల్లించిన నగదును జమ చేస్తుంది. గ్యాస్ సిలిండర్ అయ్యే ఖర్చు 851 రూపాయల సబ్సిడీని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇందుకోసం కొన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం విధించింది. ఖచ్చితంగా ఆ అర్హతలున్న వారికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటి వరకూ ఈ పథకం ప్రారంభించి నాలుగు నెలలు కావస్తుంది.

అర్హతలివీ...
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండటం, ఆధార్ కార్డుతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు ఉండాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ మూడు అర్హతులున్న వారు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే గ్యాస్ బుక్ చేసుకున్న వారు పట్టణాల్లో ఉంటే ఇరవై నాలుగు గంటల్లో సరఫరా చేస్తారు. గ్రామాల్లో నివాసం ఉంటే నలభై ఎనిమిది గంటల తర్వాత డెలివరీ చేస్తారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ కేవైసీ తప్పనిసరిగా లబ్దిదారులు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో గ్యాస్ డెలివరీ అయిన రెండు రోజుల్లో ప్రభుత్వం నగదు జమ చేసేలా ఒక వ్యవస్థను ఏపీ ప్రభుత్వం రూపొందించింది. సమస్య ఏదైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబరును కూడా ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకూ...
సమస్యలు తలెత్తిన వారు 1967 నెంబరుకు కాల్ చేయవచ్చు. అయితే ఈ నెంబరు ఎప్పుడూ బిజీగా ఉంటుందన్నది లబ్దిదారులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అదే సమయంలో తొలి సిలిండర్ ను మార్చి 31వ తేదీలోపు, రెండో సిలిండర్ ను జులై 31వ తేదీ లోపు, మూడో సిలిండర్ ను నవంబరు 30వ తేదీ లోపు బుక్ చేసుకోవచ్చు. ఏడాదికి మూడు సిలిండర్లు మాత్రమే ఉచితంగా ఇస్తారు. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకూ 93 లక్షల గ్యాస్ బుకింగ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం లబ్దిదారుల ఖాతాల్లో 714.57 కోట్ల రూపాయల నగదును జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం 2 పథకం ప్రభుత్వం సక్సెస్ అయిందని భావిస్తుండగా, ప్రజలు మాత్రం సరిగా గ్యాస్ ఏజెన్సీలు స్పందించడం లేదని ఫిర్యాదు చేస్తుండటం విశేషం. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ఏజెన్సీలు కొన్ని ఆలస్యం చేస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ఎక్కువగా అందుతున్నాయి.


Tags:    

Similar News