Weather Report : ఒకవైపు చలిగాలులు.. మరొకవైపు వానలు.. ఇదేందిరా అయ్యా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్యంగా ఉపరితల ఆవర్తనం కదులుతుందని చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన చేసింది.
ఏపీలో నేడు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారుల చేపలవేటకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
చలిగాలుల తీవ్రత...
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. చలిగాలుల తీవ్రత కారణంగా ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ బయటకు రావద్దని కూడా అధఇకారులు తెలిపారు. సిర్పూర్ లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో ఉదయం వేళ, సాయంత్రం వేళ జనసంచారం తగ్గింది. చలిగాలుల తీవ్రతతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు.