IPL 2024 : అదృష్టం ఆఖరి నిమిషంలో ముఖం చాటేసింది.. పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారులే?

రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలయింది.

Update: 2024-05-23 03:57 GMT

ఐపీఎల్ అంటే అనుకున్నది అనుకున్నట్లు జరగదు. మైదానంలో ఆరోజు ఎవరిది పై చేయి అయితే వారిదే విజయం. అందులో ఇది టీ 20కి మించిన టెన్షన్.. అభిమానుల నుంచి వత్తిడి అధికం. అన్నీ వెరసి ఆటగాళ్ల పెర్‌ఫార్మెన్స్ పై ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లోనూ అదే జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పుంజుకుందని అందరూ భావించారు. అందరూ ఫుల్లు ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఇక ఆ జట్టును ఆపేది ఎవరంటూ విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని భావించారు. కానీ అనుకున్నది అనుకున్నట్లు.. అంచనా వేసినట్లు జరిగితే అది ఐపీఎల్ ఎందుకవుతుంది? అందుకే ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పరాజయం తప్పలేదు. ఫైనల్స్ కు చేరకుండానే తన కధను ముగించాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలయింది.

అంచనాలు ఎక్కువగానే...
అందుకే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్లు పెట్టుకోవద్దంటారు. అందులోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్స్ ఎక్కువ. విరాట్ కోహ్లి ఉండటం ఒక కారణం కావచ్చు. ప్లే ఆఫ్ కే చేరడం కష్టమని భావించిన ఆ జట్టు ఎట్టకేకలకు నాలుగోస్థానానికి రావడంతో ఆశలు మరింత పెరిగాయి. దీంతో అంచనాలు కూడా అధికమయ్యాయి. కానీ ఏం లాభం.. సరైన సమయంలో అందరూ చేతులెత్తేశారు. అహ్మదాబాద్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలవడం కష్టం. మొదట టాస్ రూపంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు అదృష్టం ముఖం చాటేసింది. టాస్ రాజస్థాన్ రాయల్స్ కు పడటంతో ఫీల్డింగ్ ను ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లి, డూప్లిసెస్ లు నిదానంగానే ఆడుతున్నా వాళ్లిద్దరూ ఉన్నారులే అన్న ధీమా ఎంత సేపో నిలవలేదు. డూప్లెసెస్ కొట్టిన బంతిని సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాట పట్టాడు. 17 పరుగులకే అవుటయ్యాడు.
ఎవరూ పెద్దగా పరుగులు...
విరాట్ ఉన్నాడులే అన్న ధీమా కూడా కొద్దిసేపటికే సడలి పోయింది. కోహ్లి 33 పరుగులు చేసి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక గ్రీన్ కుదురుకున్నట్లు కనిపించినా 27 పరుగుల వద్ద అశ్విన్ అవుట్ చేశఆడు. తర్వాత రజత్ పాటీదార్ ఉన్నాడులే అనుకుంటున్న సమయంలో 34 పరుగుల వద్ద ఆవేష్ ఖాన్ అవుట్ చేశాడు. మ్యాక్స్‌వెల్ ఎప్పటిలాగానే డకౌట్ అయ్యాడు. లొమ్రార్ 32 పరుగులు చేశాడు. ఇక మిగిలిన వాళ్లు కూడా చేతులెత్తేయడం, అప్పటికే ఓవర్లు అయిపోవడంతో ఇరవై ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 172 పరుగులు మాత్రమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేయగలిగింది.
లక్ష్యం చిన్నదే అయినా...
ఐపీఎల్ లో అదీ రాజస్థాన్ రాయల్స్ ముందు ఇది అంత పెద్ద స్కోరు కాదు. కానీ ఎక్కడో ఆశ. గెలుస్తారులే.. అదృష్టం ఇప్పటి వరకూ జట్టును తట్టినట్లుగానే ఇప్పుడు కూడా తడుతుందిలే అనుకున్నారు. కానీ లక్ తిరగబడింది. 172 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడి 45 పరుగులు చేశఆడు. క్యాడ్ మోర్ 20 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 17 పరుగులకు అవుటయ్యాడు. అయితే హెట్ మెయర్, పావెల్, అశ్విన్ ఆ లక్ష్యాన్ని పూర్తి చేశారు. 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174ప రుగుల చేయడంతో రాజస్థాన్ రాయల్స్ దే విజయం అయింది. బెంగళూరు జట్టు ఇంటి దారి పట్టింది. రాజస్థాన్ రాయల్స్ రేపు చివరి క్వాలిఫయిర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.


Tags:    

Similar News