IPL 2024 : ఇంకో ఆరు పరుగులు చేసి ఉంటే రికార్డు దక్కేది కదా సామీ?

విశాఖలో జరిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రికార్డు మిస్ అయింది

Update: 2024-04-04 04:23 GMT

విశాఖ స్టేడియం సిక్సర్లు, ఫోర్ల మోతతో మారుమోగిపోయింది. స్టేడియం నలువైపులా బంతి పరుగుపెడుతూనే ఉంది. హైదరాబాద్ లో ఉన్న రికార్డు తృటిలో విశాఖలో మిస్ అయింది. మరో ఐదు పరుగులు చేసి ఉంటే ఆ రికార్డును సమం చేసేది. ఆరు పరుగులు చేసి ఉంటే రికార్డు బద్దలు కొట్టేంది. విశాఖలో జరిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పసందైన షాట్లను క్రికెట్ ఫ్యాన్స్ చూశారు. చివరకు ఢిల్లీ ఓటమి పాలయింది. 106 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విక్టరీలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఎగబాకింది.

భారీ స్కోరు చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, ఇరవై ఓవర్లలో 272 పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ లో నరేన్ విజృంభించి ఆడాడు. కేవలం 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయంటే నరేన్ ఆటను ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. రఘువంశీ కొత్త కుర్రాడైనా నిలబడి స్కోరును పరుగులు పెట్టించాడు. యాభై నాలుగు పరుగులు చేసిన రఘువంశీ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రస్సెల్ ఇక ఆగలేదు. 41 పరుగులతో స్కోరును 272 పరుగులకు చేర్చాడు.
ఛేదనలో చతికలపడి...
ఇది ఢిల్లీ కాపిటల్స్ కు పెద్ద స్కోరు. ఛేజ్ చేయాలంటే కష్టమే. విశాఖలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తుందని గణాంకాలు చెప్పినట్లే జరిగింది. ఛేదనలో చేతులెత్తేసింది. రిషబ్ పంత్ 55 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 54 పరుగులు చేశాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు మాత్రం విఫలమయ్యారు. స్కోరు పెద్దది కావడంతో ఎవరూ క్రీజు లో నిలబడలేకపోయారు. ముందుగానే గెలుపు కోల్‌కత్తా నైట్ రైడర్స్ ది అని అందరికీ అర్థమయింది. అలాగే భారీ పరుగుల తేడాతో రైడర్స్ విజయం సాధించింది. ఢిల్లీ కాపిటల్స్ నిరాశతో వెనుదిరిగింది.


Tags:    

Similar News