IPL 2024 : థాంక్ గాడ్.. చివరి బంతి వరకూ టెన్షన్ పెట్టకుండానే ముగించారే

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది

Update: 2024-04-20 03:51 GMT

ఐపీఎల్ లో విజయం ఎవరిని వరిస్తుందన్నది చివరి బంతి వరకూ చెప్పలేం. అతే దానికున్న స్పెషాలిటీ. ఓడిపోతుందనుకున్న జట్టు కూడా అనూహ్యంగా పుంజుకుని విజయం దక్కించుకున్న మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్. నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. అది కెప్టెన్ కెఎల్ రాహుల్ పోరాట ఫలితమేనని చెప్పాలి. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ తన జట్టును గెలిపించాడు. చెన్నైకి షాకిచ్చాడు. తక్కువ స్కోరు ఏమీ కాదు. ఆ పిచ్ పై 150 చేయడం కూడా గగనమే అలాంటిది లక్ష్యాన్ని సాధించడంలో లక్నో సక్సెస్ అయింది.

తక్కువ అని అనుకున్నా...
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ లో బ్యాటర్లు దాదాపుగా విఫలమయ్యారు. ఓపెనర్లు క్యూ కట్టారు. రచిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులకే అవుటయ్యాడు. జడేజా మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. జడేజా 57 పరుగులు చేశాడు. శివమ్ దూబే కూడా ఈ మ్యాచ్ లో రాణించలేదు. రిజ్వి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. మొయిన్ ఆలీ పరవాలేదనపించాడు. ముప్పయి పరుగులు చేశాడు. ధోని చివర్లో వచ్చి కొంత బాదుడు బాదడంతో ఆ మాత్రం స్కోరు అయినా వచ్చింది. చివరకు ఇరవై ఓవర్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్లు నష్టపోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పిచ్ సహకరించకున్నా...
అయితే ఈ మైదానంలో ఇదే అతి పెద్ద స్కోరు. దీనిని ఛేదించడం అంత సులువు కాదు. కానీ దానిని ఈజీ అని నిరూపించాడు కెప్టెన్ రాహుల్. ఓపెనర్ గా వచ్చిన ఇద్దరూ నిలబడి ఆడటంతో కొంత స్కోరు వేగం పెరిగింది. డీకాక్ యాభై నాలుగు పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే పూరన్ సహకారం రాహుల్ కు పుష్కలంగా లభించింది. దీంతో రాహుల్ 82 పరుగులు చేశాడు. రాహుల్ అవుటయినా పూరన్, స్టాయినిస్ కలిసి మ్యాచ్ ను విజయం వైపు నడిపించారు. 19 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. వరస ఓటములతో ఉన్న జట్టకు పెద్ద రిలీఫ్ దక్కింది.




Tags:    

Similar News