IPL 2024 : రాహుల్ శ్రమకు ఫలితం దక్కుతుందిగా... కేఎల్ ఆటతీరుకు అందరూ ఫిదానే

గుజరాత్ టైటాన్స్ మీద లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది.

Update: 2024-04-08 03:53 GMT

గుజరాత్ టైటాన్స్ మీద లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టి కృషితో జట్టుకు విజయాన్ని అందించారు. లక్నో సూపర్ జెయింట్స్ నిజంగానే జెయింట్ లాగా ఈ సీజన్ లో నిలిచింది. వరసగా విజయాలను నమోదు చేసుకుంటూ వెళుతుంది. మూడు విజయాలను వరసగా నమోదు చేసి ఛాంపియన్ రేసులో తాను ఉన్నానని లక్నో సూపర్ జెయింట్స్ చెప్పకనే చెప్పింది. లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ మీద 33 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో కేఎల్ రాహుల్ నాయకత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. రాహుల్ కూల్ గా ఉంటూ జట్టును విజయతీరాలకు తీసుకెళుతున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తక్కువ పరుగులే ...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ లో దూకుడు మీదున్న డికాక్ అవుట్ కావడంతో ఆ వెనువెంటనే పడిక్కల్ కూడా అవుట్ కావడంతో దాని అభిమానులు నిరాశలో పడ్డారు. అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీలయినప్పుడల్లా ఫోర్లు బాదుతూ జట్టు స్కోరును పెంచాడు. ఇక రాహుల్ కు తోడు స్టయినస్ తోడవ్వడంతో జట్టు ఒక దశలో బాగానే స్కోరు చేస్తుందని భావించారు. స్టయినిస్ 56 పరుగులు చేసి అవుట్ కావడంతో పూరన్ రంగంలోకి దిగి 32 పరుగులు చేశాడు, బదోని కూడకా ఇరవై పరుగులు చేశాడు. ఇరవై ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
బౌలర్ల దెబ్బకు...
163 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు. అందులో ఈ సీజన్ లో దానిని అధిగమించడం కూడా పెద్ద లెక్కకాదు. దీంతో అందరూ గుజరాత్ టైటాన్స్ దే ఈ మ్యాచ్ అని అంచనాకు వచ్చారు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు విజృంభించడంతో గుజరాత్ టైటాన్స్ ఓటమి బాట పట్టింది. యశ్ ఠాకూర్ ఐదు వికెట్లు తీయగా, కృనాల్ పాండే మడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును మట్టికరిపించాడు. బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో పరాజయాన్ని చవి చూసింది. లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. పేరుకు తగినట్లుగానే సూపర్ జెయింట్స్ గా నిలిచింది.


Tags:    

Similar News