Ukraine Crisis : బితుకు బితుకుగా ఉక్రెయిన్ లో భారతీయులు

ఉక్రెయిన్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు

Update: 2022-02-24 13:11 GMT

ఉక్రెయిన్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉన్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థులు కీవ్ ఎయిర్ పోర్టులో చిక్కుకుని పోయారు. విమానాల రాకపోకలను నిలిపివేయడంతో విద్యార్థులు ఎయిర్ పోర్టులోనే వారు గడుపుతున్నారు. తమ తల్లిదండ్రులకు ఫో్న్ చేసి తమను వెంటనే భారత్ కు తీసుకెళ్లాలని కోరుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన....
విశాఖకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. తమకు తిండి, నీళ్లు కూడా దొరకడం లేదని వారు తల్లిదండ్రులకు మొర పెట్టుకుంటున్నారు. ఇక తెలంగాణ కు చెందిన విద్యార్థులు సయితం ఉక్రెయిన్ లో తమ ఇళ్లలోనే ఉండి పోయారు. వీరిలో కొందరు ముందు జాగ్రత్త చర్యగా ఆహారానికి కావాల్సిన సామగ్రిని తెచ్చుకోవడంతో కొంత స్థిమితంగా ఉన్నారు. యుద్ధం ప్రారంభమయిన వెంటనే అక్కడ స్టోర్స్ అన్నీ వినియోగదారులతో కిటకిటలాడిపోయాయి. వస్తువులను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టడంతో స్టోర్స్ అన్నీ నిండిపోయాయి. కొన్ని స్టోర్స్ లో సామాగ్రి అయిపోవడంతో వాటిని మూసి వేశారు.
అప్రమత్తమయిన ఎంబసీ....
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్థం ప్రారంభం కావడంతో భారత దౌత్య కార్యాలయం అప్రమత్తమయింది. భారీతీయులు ఎవరూ ఇళ్లను వదిలి బయటకు రావద్దని కోరింది. ఇప్పటికే భారత్ ఈ యుద్ధం పట్ల తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ఉక్రెయిన్ లోని తమ దౌత్య కార్యాలయం 24 గంటలు తెరిచి ఉంటుందని పేర్కొంది. హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తెచ్చింది. రష్యా బాష తెలిసిన రాయబారులను ఉక్రెయిన్ కు భారత్ పంపింది. భారతీయులను వెనక్కు తీసుకు వచ్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు భారత్ రాయబార కార్యాలయం ప్రకటించింది.


Tags:    

Similar News