ఆపరేషన్ గంగ.. భారతీయుల కోసం మరో 10 విమానాలు సిద్ధం

ఆపరేషన్ గంగలో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరికొంతమంది భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ఫిబ్రవరి 28, మార్చి1, 2 తేదీల్లో..

Update: 2022-02-28 07:22 GMT

న్యూ ఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతమవుతోంది. ఆపరేషన్ గంగ పేరుతో మొదలుపెట్టిన భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఉక్రెయిన్ నుంచి భారత్ కు 5 విమానాలు రాగా..వాటిలో మొత్తం 1156 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇంకా వేలమంది భారతీయులను దేశానికి తీసుకురావాల్సి ఉంది.

ఆపరేషన్ గంగలో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరికొంతమంది భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ఫిబ్రవరి 28, మార్చి1, 2 తేదీల్లో రొమేనియా, హంగేరి లకు 10 భారతీయ విమానాలు వెళ్లనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు బుడాపెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం భారత్ కు చేరుకోనుంది. అలాగే బుడాపెస్ట్, బుకారెస్ట్ లకు నాలుగు విమానాలు వెళ్లనున్నాయి. భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో ఎయిరిండియా సర్వీసులు అందిస్తోంది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో విమానాలు ఆపరేషన్ గంగలో పాల్గొని భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్నాయి. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ తిరిగి తీసుకొచ్చేందుకు కనీసం మరో 50 విమాన సర్వీసులైనా నడపాల్సి ఉంటుందని అంచనా.


Tags:    

Similar News