ఉగాది అంటే ఏమిటి ? ఏడాదికి ఓసారి వచ్చే ఈ తెలుగు సంవత్సరాది వెనుకున్న కథలేంటి ?

చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు..

Update: 2023-03-19 07:26 GMT

importance of ugadi, story behind ugadi

ఉగాది అంటే.. అచ్చమైన అసలుసిసలైన తెలుగింటి పండుగ. తెలుగు వారికి ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలలోనూ తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు. కాకపోతే అక్కడ ఈ పండుగను వారి భాషలో పిలుస్తారు. ఆంగ్లసంవత్సరాది జనవరి 1తో మొదలైతే.. తెలుగు సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. న్యూ ఇయర్ కి నంబర్లు ఉన్నట్టే.. తెలుగు సంవత్సరాది కూడా ఏడాదికో పేరుతో ప్రారంభమవుతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఇంగ్లీష్ నెలలున్నట్టే.. చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ 12 తెలుగు నెలలు ఉంటాయి. అప్పుడప్పుడూ అధికమాసాలు వస్తే.. 13 నెలలు కూడా ఉంటుంటాయి. అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటాం ? దాని వెనుక ఉన్న పురాణ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు. ఈ రెండింటినీ కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే.. బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి, వేదాలను హరించిన సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పజెప్పడం, శాలివాహనుడు పట్టాభిషిక్తుడై శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లింది కూడా ఉగాదినాడే అని పురాణాల్లో పేర్కొన్నారు.
అంతేకాదు.. ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులురాలి.. కొత్తగా చిగురిస్తాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మావిడి పిందెలు, వేపపూత.. ఇలా పూల సువాసనలతో వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం. కానీ ప్రతిరాష్ట్రంలోనూ ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తినడం సహజం. అందులోని షడ్రుచుల మాదిరిగానే.. జీవితంలోనూ కష్టసుఖాలు వస్తుంటాయని చెప్పడమే ఉగాది పచ్చడి ప్రత్యేకత.
ఈ రోజు చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. తెలుగు సంవత్సరాదిలో మొదటిరోజు కావడంతో ఆరోజు మంచి పనులు ప్రారంభిస్తే ఏడాదంతా సంతోషంగా ఉంటారని నమ్మిక.





Tags:    

Similar News