హస్తినాపురంలో కల్వకుంట్ల వారి రాజనీతి!

Update: 2016-09-22 12:49 GMT

మన ఇంట్లో మనం ఎలాగైనా కొట్టుకుందాం.. కానీ బయటి వారి ఎదుట వ్యవహరించేప్పుడు అందరం ఒకటే యూనిట్‌ లాగా కలిసి ఉందాం.. అనేది సరైన వ్యక్తిత్వ వికాస నీతి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అచ్చమైన విపక్షం మాదిరిగానే పరిగణించి దూరం పెట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తన ఢిల్లీ పర్యటనలో మాత్రం ఇలాంటి రాజనీతిని ప్రదర్శిస్తున్నారు.

కేంద్రంనుంచి తెలంగాణకు నిధులు రాబట్టడంలో మరింత మెరుగ్గా పనిచేయాలని, ఇందుకు కేంద్రమంత్రిగా సహకరించాలని ఆయన దత్తాత్రేయను కలిసి విన్నవించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి కూడా చర్యలు తీసుకునేలా ఆయన దత్తన్న ను కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ సందర్భంగా కేసీఆర్‌ హస్తిన లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి పార్టీ రహితంగా అందరూ కలసి మెలసి పనిచేయాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. మరి అదే కేసీఆర్‌ కేవలం కొన్ని రోజుల ముందు .. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే భాజపా డిమాండును బుట్ట దాఖలు చేశారు ఎందుకు? కలసి పనిచేయడంలో ఎదుటి వారి అభిప్రాయాలకు కూడా విలువ ఉంటుందనే సంగతి ఆయన మరచిపోయారా? బహుశా ఆ విషయం దత్తన్న ఇవాళ సీఎంను అడిగి ఉండకపోవచ్చు.

Similar News