సీఎం తలకు కోటి రూపాయలు వెల కట్టేశారు

Update: 2017-03-02 18:29 GMT

ఎక్కడైనా తలను ఎవరికి వెల కడతారు? ఐసిస్ ఉగ్రవాదులకు తలకు వెల కడతారు. మావోయిస్టులకూ ఒక లెక్కుంటుంది. కాని చిత్రంగా ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత ఏకంగా ఒక ముఖ్యమంత్రి తలకే వెలకట్టడం సంచలనం కల్గిస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తల తెస్తే కోటి రూపాయలను ఇస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. వివాదాస్పదమైంది.

కేరళలో జరుగుతున్న హత్యలతోనే....

మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ ఈ ప్రకటన చేయడంతో బీజేపీతో సహా ఆర్ఎస్ఎస్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ చంద్రావత్ ప్రసంగిస్తూ కేరళ ముఖ్యమంత్రి తల తెస్తే కోటి రూపాయలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాదు ఇందుకోసం తన యావదాస్తినీ విక్రయించేందుకు కూడా సిద్ధమని ప్రకటించడంతో సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ప్రకటన చేయడం వెనుక, కేరళ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కేరళలో ఇటీవల ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పదుల సంఖ్యలో హత్యకు గురికావడమే. కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యల పట్ల బీజేపీ కూడా మండిపడుతోంది. ఇటీవల కర్ణాటక కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయన్ వస్తున్నారని తెలిసి ఆందోళనకు కూడా దిగింది. విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది బీజేపీ నేతలు హత్యకు గురయ్యారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ చంద్రావత్ విజయన్ పై ఈ సంచలన ప్రకటన చేశారంటున్నారు. మొత్తం మీద ఒక సీఎం తలకు వెల కట్టడం దేశంలో ఇదే మొదటిసారి అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Similar News