సారీ చెప్పను కానీ నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా: రోజా

Update: 2016-04-07 12:09 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు దిగి వచ్చారు. సహచర మహిళా ఎమ్మెల్యే అనితపై నోరు పారేసుకుని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన ఆర్ కె రోజా బుధవారం శాసనసభ ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరయ్యారు. కమిటీ ముందు రోజా వివరణ ఇచ్చారు. అనితపై తనకెలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, సహచర మహిళా ఎమ్మెల్యేలను తులనాడే అంత కుసంస్కారం తనది కాదని రోజా వివరించారు.సభలో ఆ సమయంలో జరుగుతున్న కాల్ మనీపై చర్చ సందర్భంగానే తాను మాట్లాడాను తప్ప ఎవరినీ కించ పరచాలి, ఎవరి మనోభావాలనో దెబ్బ తీయాలన్న ఉద్దేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అనిత తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా దాదాపు అరగంట పాటు వివరణ ఇచ్చారు. రోజా ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్నామని, త్వరలోనే సభాపతి కోడెల శివప్రసాదరావుకు నివేదికను అందించనున్నామని కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యరావు ఆ తర్వాత మీడియాకు తెలిపారు.

Similar News