సారథ్యం చంద్రబాబుకే.. ఎజెండాలో ప్రజల కష్టాల్లేవ్

Update: 2016-11-30 21:00 GMT

ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అయిదుగురు ముఖ్యమంత్రులతో మాత్రమే అనుకున్న కమిటీ కాస్తా 13 మంది సభ్యులతో జంబో కమిటీగా మారింది. మొత్తానికి సారథ్యం ముందుగా ప్రచారం జరిగినట్లే చంద్రబాబునాయుడు చేతిలోనే పెట్టారు. ఈ కమిటీ ఈ దేశాన్ని డిజిటల్, ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల దిశగా నడిపించడం గురించిన కసరత్తు చేసి.. ప్రతిపాదనలు తయారుచేస్తుంది. వాటిని కేంద్రం పరిశీలించి.. దేశంలో సామాన్యుల ఆర్థిక లావాదేవీలు సైతం ఆన్లైన్, డిజిటల్ మార్గంలోనే ఎలాంటి నల్లధనం పేరుకోవడానికి అవకాశమే ఉండని రీతిలోకి మార్చడానికి నిర్ణయాలు తీసుకుంటుంది.

అయితే తాజాగా జరిగిన మార్పు ఏంటంటే.. ఇదివరకు ఈ కమిటీ గురించిన సమాచారం తొలుత బయటకు వచ్చినప్పుడు వీరికి రెండు బాధ్యతలు ఉండేవి. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడం అనేది ఆ బాధ్యతల్లో ప్రాథమికమైనది. అలాగే.. ఆన్ లైన్ లావాదేవీలు పెరగడానికి ప్రజలకు ఎలాంటి చైతన్యం కలిగించాలి, ఎలాంటి రుసుముల రద్దు ఉండాలి, ఎలాంటి చర్యల వల్ల ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీల వైపు మొగ్గే అవకాశం ఉంటుంది అనేది రెండో బాధ్యత. అయితే కొత్గగా ప్రకటించిన కమిటీకి ప్రజలకష్టాలను తీర్చే ఆలోచనల బాధ్యతను తొలగించారు. ఆన్ లైన్ లావాదేవీలకు సిఫారసులను మాత్రమే వీరినుంచి ప్రభుత్వం ఆశిస్తోంది.

అయితే ఒక దశలో అసలు కేంద్రం ఏర్పాటు చేయదలచుకున్న కమిటీ వ్యవహారమే అనుమానంగా మారింది. తొలుత అయిదుగురుముఖ్యమంత్రులతో కమిటీ వేస్తున్నట్లు, దానికి చంద్రబాబు సారథ్యం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు వీటిపై స్పందిస్తూ తనను నియమించినట్లుగానీ, డిసెంబరు తొలివారంలో డిల్లీలో కమిటీ సమావేశం ఉంటుందని గానీ తనకు ఎలాంటి సమాచారం లేదంటూ అసహనంగా చెప్పడంతో.. అసలు కమిటీ సంగతేంటి అని అనుమానాలు కలిగాయి. అయితే.. అయిదుగురు సీఎంలతో మాత్రమే అనుకున్న కమిటీలో కీలకమైన అదికారులకు కూడా స్థానం కల్పిస్తూ 13 మందితో ప్రభుత్వం దీనిని ఏర్పాటుచేసింది. కమిటీ సారథ్యం చంద్రబాబు భుజాల మీదే పెట్టారు గానీ.. బాధ్యతలు ప్రజలు కష్టాలు తీర్చడం గురించి కాకుండా, వారికి చైతన్యం కలిగించడం గురించి మాత్రమే ఉండడం గమనార్హం.

Similar News