సర్కారుకు తలనొప్పిగా నయీం కేసు

Update: 2017-02-07 05:12 GMT

గ్యాంగ్ స్టర్ నయీం కేసు సర్కారుకు తలనొప్పిగా మారే అవకాశముంది. నయాం కేసులో రాజకీయ నేతలు, పోలీసు అధికారుల ప్రమేయం ఉందని, ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీపీఐ నేత నారాయణ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే నారాయణ డీజీపీకి లేఖ కూడా రాశారు. నయీంతో రాజకీయ నేతలకు, పోలీసులకు సంబంధాలున్నట్లు స్పష్టమయ్యాయని, అందుకు సంబంధించి ఫొటోలు కూడా బయటపడ్డాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని నారాయణ డీజీపీని తన లేఖలో కోరారు. అధికార పార్టీ నేతలకు కూడా నయీంతో సంబంధాలున్నట్లు తమకు అనుమానాలున్నాయని నారాయణ తెలిపారు. దీనిపై నారాయణ నయీం కేసును పునర్విచారించాలని మంగళవారం హైకోర్టును ఆశ్రయిస్తుండటంతో నయీంతో సంబంధాలున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

హైకోర్టుకు నారాయణ....

గ్యాంగ్ స్టర్ నయీం అక్రమాలు, హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ కు అప్పగించింది. అయితే సిట్ దర్యాప్తులో అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా నయీం డైరీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసు అధికారుల ఫొటోలు కూడా నయీంతో ఉన్న సంబంధాలను బాహ్య ప్రపంచానికి తెలియజేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం తొలినాళ్లలో ఉన్న కఠినంగా ఇప్పడు లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలను ఈ కేసు నుంచి తప్పించేందుకే ప్రభుత్వం నయీం కేసును నీరుగారుస్తుందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర హోం శాఖ కూడా నయీంతో రాజకీయ నాయకులకు సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో నయీం కేసు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి కూడా ఫొటోలు ఆధారంగా చర్యలు తీసుకోలేమని, సిట్ నివేదిక ఆధారంగానే చర్యలుంటాయని స్పష్టం చేయడంతో సీపీఐ నేత నారాయణ కోర్టును ఆశ్రయించనున్నారు. బయటపడిన ఫొటోలను కూడా నారాయణ కోర్టుకు సమర్పించబోతున్నారట. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తోందనన్న ఉత్కంఠ సర్కారులో నెలకొంది.

Similar News