శ్రీవారి సన్నిధిలో దాహం...దాహం..

Update: 2017-01-19 03:53 GMT

ఏడుకొండల వాడి సన్నిధిలో నీటి సమస్య తలెత్తింది. తిరుమలలో ఉన్న డ్యాముల్లో నీరు అడుగింటింది. వచ్చే వేసవి కాలంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈసారి భక్తులకు నీటికష్టాలు తప్పేట్లు లేవు. నైరుతీ రుతు పవనాలు తిరుమలపై తగినంత వర్షం కురిపించ లేదు. ఈశాన్య రుతుపవనాలు ఏడుకొండల వైపు తొంగి చూడలేదు. దీంతో కలియుగ వైకుంఠంలో నీటి ఎద్దడి తప్పేట్లు లేదు. వచ్చే వేసవికి భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి సరఫరాను ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచే టీటీడీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం డ్యామ్ లో ఉన్న నీరు కేవలం రెండు నెలలకు మాత్రమే సరిపోతుందంటున్నారు టీటీడీ అధికారులు.

తిరుమలలో రోజుకు 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. కొండ మీద ఉండే వారితో పాటుగా నిత్యం తిరుమలను దర్శించే భక్తుల కోసం ఈ నీరు అవసరమవుతుంది. తిరుమలపై గోగర్భ డ్యామ్, ఆకాశగంగ, పాపవినాశనం డ్యామ్ లు ఉన్నాయి. వీటి నుంచే రోజూ తిరుమలకు నీటి సరఫరా జరుగుతుంటోంది. ఈ డ్యామ్ లతో నీటి అవసరాలు తీరవని గుర్తించిన టీటీడీ కుమార, పసుపు ధారా డ్యామ్ లను నిర్మించింది. అన్ని ప్రాజెక్టులలో 14 లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ ఉంచుకునే సామర్ధ్యం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా వర్షాలు కురవక పోవడంతో డ్యామ్ లలో నీటి నిల్వలు తగ్గాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్యామ్ లేవీ నిండ లేదు. నీలి నిల్వ ప్రస్తుతం 890 గ్యాలన్లు మాత్రమే ఉందంటున్నారు. గతంలో కింద తిరుపతి నుంచి నీటిని పంపింగ్ చేసుకునే వారు. కల్యాణి డ్యామ్ నుంచి 5 ఎం.ఎల్.డిలు, కార్పొరేషన్ నుంచి తెలుగుగంగ నీటిని పంపింగ్ చేసి కొండపైన నీటి అవసరాలు తీర్చే వారు. అయితే ఇప్పడు తిరుపతిలో కూడా నీటి ఎద్దడి నెలకొని ఉండటంతో పంపింగ్ చేసే పరిస్థితి లేదు. ఉన్న నీరు నగర అవసరాలకే సరిపోదంటున్నారు తిరుపతి కార్పొరేషన్ అధికారులు. దీంతో ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి టీటీడీది. అందుకోసం వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది టీటీడీ. నీటి పొదుపుకు శ్రీకారం చుట్టింది. తిరుమల కొండపై ఉన్న ప్రయివేటు హోటల్లకు నీటి సరఫరాను బంద్ చేసేసింది. అదనంగా ఉన్న టీటీడీ కుళాయిలను మూసివేస్తుంది. డ్రైనీజీ నీటిని శుద్ధీకరించి తిరుమలలో ఉన్న ఉద్యానవనాలకు వాడుతోంది. ఇంత పొదుపు చేసినా...వేసవి రద్దీని తట్టుకోవడం కష్టమేనని, భక్తులకు నీటి సమస్య తప్పదంటున్నారు టీటీడీ సిబ్బంది.

Similar News